మళ్లీ సస్పెన్షన్.. ఏబీవీపై వేటు.. ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. పోస్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చి.. మరోసారి సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్‌కు గురైన వెంకటేశ్వరరావు.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఇటీవలే తిరిగి సర్వీసులో చేరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డీజీగా ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును నియమించింది.

డీజీగా బాధ్యతలు.. ఆ వెంటనే
ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంకటేశ్వరరావు ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. క్రమశిక్షణా రహితంగా వ్యవహరించడంతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను మరోసారి సస్పెండ్ చేశారు. సుదీర్ఘకాలం న్యాయపోరాటం తరువాత ఇటీవల ఆయనను విధుల్లోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. కొద్దిరోజుల క్రితమే ఆయనకు ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా పోస్టింగ్ కూడా ఇచ్చింది.

అతిక్రమణ
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో ఆయనను ఏపీ ప్రభుత్వం విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవినీతి జరిగిందని, ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కోర్టును ఆశ్రయించి
ప్రభుత్వం నిర్ణయంపై ఏబీవీ కోర్టును ఆశ్రయించడంతో ఆయనపై సస్సెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండేండ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని పేర్కొంటూ.. ఏబీవీని తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.

కొట్టివేసిన సుప్రీంకోర్టు
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, ఆయన ఏప్రిల్ 29న సాధారణ పరిపాలన శాఖకు నివేదించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కోరారు. అప్పటినుంచి కోరగా ఇటీవలే పోస్టింగ్ ఇచ్చారు. ఆ వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.












Click it and Unblock the Notifications