మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ... షర్టు కాలర్ పట్టుకుని అనుచితంగా ...
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు పరాభవం జరిగింది. అనంతపురంలోని నారాయణ విద్యాసంస్థల్లో సమీక్ష నిర్వహించడానికి వచ్చిన ఆయనను విద్యార్థి సంఘం నాయకులు నిలదీశారు. షర్టు కాలర్ పట్టుకుని ప్రశ్నించి అవమానించారు.

అనంతపురం విద్యాసంస్థలలో సమీక్షకు వెళ్ళిన నారాయణకు పరాభవం
కళాశాలలలో సాగుతున్న ఫీజుల దోపిడీపై, మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న తీరుపై సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి నారాయణను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారాయణ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అనంతపురం విద్యాసంస్థలలో సమీక్షకు నారాయణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకొని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని నారాయణను నిలదీసే ప్రయత్నం చేశారు.

నారాయణను చుట్టుముట్టి నిలదీసిన విద్యార్ధి సంఘాల నాయకులు
నారాయణ కాలేజీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతోపాటు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుపుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ కళాశాలలను మూసివేయాలని ఆవుల రాఘవేంద్ర అనే యువకుడు నారాయణను అందరి ముందూ నిలదీశాడు. విద్యార్థి సంఘ నాయకులందరూ నారాయణను చుట్టుముట్టడంతో కళాశాల సిబ్బంది ఆయనను అక్కడి నుంచి తప్పించి పంపించే ప్రయత్నం చేశారు.

సమాధానం చెప్పే వెళ్ళాలని షర్టు కాలర్ పట్టుకున్న విద్యార్ధి
ఈ క్రమంలో తమకు సమాధానం చెప్పే వెళ్లాలని నారాయణ షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీశాడు ఓ విద్యార్థి. పక్కనే ఉన్న కొందరు అతన్నుంచి నారాయణను విడిపించి, కారు దగ్గరకు తీసుకువెళ్లి ఆయనను పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా ఆగని విద్యార్థి సంఘాల నాయకులు కారును చుట్టుముట్టి కార్ పై రాయితో బలంగా కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సైలెంట్ అయిన నారాయణ
ఒకప్పుడు మంత్రిగా రాష్ట్రంలో హవా చూపించిన నారాయణ ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజులలోనే నారాయణ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని చెప్పి నారాయణ కాలేజీలకు సీజ్ చేసి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఆయన అవమానం ఎదుర్కొన్నారు. ఆయనకు వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి షాక్ లు , పరాభవాలు తప్పటం లేదని తాజా పరిణామాలతో తెలుస్తుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!