అనంతపురం జిల్లా ఎస్పీపై కేసు నమోదు - ఏఆర్ కానిస్టేబుల్ డిస్మిస్ వ్యవహారంలో ట్విస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగంలో కలకలం చెలరేగింది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లిపై కేసు నమోదైంది. మహిళలను మోసం చేసిన కేసులో డిస్మిస్‌కు గురైన ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కానిస్టేబుల్ కే ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫక్కీరప్పతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు జిల్లా అదనపు ఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాపై కేసులు నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్‌లోని 167, 177, 182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టారు. దీనిపై డీఐజీ ర్యాంక్ అధికారి విచారణ చేపడతారని అనంతపురం టూటౌన్ సీఐ శివరాముడు తెలిపారు. ఏ ఆర్ కానిస్టేబుల్ కే ప్రకాష్ తనను మోసం చేసినట్లు బీ లక్ష్మి అనే మహిళ గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో 2019లో కేసు నమోదు చేశారు. తనను మోసగించి 10 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు.

బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అనంతరం జిల్లా పోలీసు అధికారులు ప్రకాష్‌ను డిస్మిస్ చేశారు. ఈ కేసులో తాను నిరపరాధినని, తాను ఎలాంటి మోసానికీ పాల్పడలేదంటూ ప్రకాష్ చెప్పారు. దళితుడిని కావడం వల్లే తనపై కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తనప తప్పుడు కేసులు పెట్టిన బాధ్యులైన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2019లో తనపై నమోదైన కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోందని, అయినప్పటికీ అధికారులు తనను దోషిగా తేల్చారని మండిపడ్డారు.
సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ పాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, మరో ఇద్దరు సీఐల నేతృత్వంలో విచారణ పూర్తిగా ఏకపక్షంగా సాగిందని ప్రకాష్ ఆరోపించారు. న్యాయస్థానం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. అధికారులు తనపై కక్ష కట్టి, వారికి వారే నేరం రుజువైందని నిర్ణయించుకొని ఉద్యోగం నుంచి తొలగించారని ధ్వజమెత్తారు. ఆయా వివరాలన్నింటినీ ఆయన టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications