జగన్ కు జనసేన లడ్డూ ఛాలెంజ్, భయంతో మోదీకి లేఖ రాశారు
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని వెలుగు చూడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రత్యేకంగా సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి విచారణ జరిపించడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది.
తిరుమలలో జరిగిన ఆచారానికి ఏడుకొండల స్వామి క్షమించు అంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత ధీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా 111 మంది జనసేన నాయకులు, జనసైనికులు ప్రాయశ్చిత దీక్ష చేపట్టడానికి సిద్ధమయ్యారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన కల్తీ వివాదంపై ఆధారాలతో సహా బయటకు వచ్చినా దానికి మాజీ సీఎం జగన్ సరైన సమాధానం చెప్పలేక కాకమ్మ కథలు మాట్లాడుతున్నాడని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

శ్రీవారి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారా ?, లేదా ? అనే విషయంలో అప్పటి టీటీడీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లు వివరణ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని జనసేన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని పదే పదే డిమాండ్ చేస్తున్న జగన్ తిరుమల కల్తీ నెయ్యి విషయంలో హిందువులకు వివరణ ఇవ్వడంలో ఆయన ఎందుకు పూర్తిగా విఫలం అయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చిన్నాన్న వైవీ. సుబ్బారెడ్డి నాలుగు సంవత్సరాలు చైర్మన్ గా పని చేశారని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జగన్ వీరవిధేయుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పని చేశారని జనసేన పార్టీ నాయకులు గుర్తు చేశారు.

ఆ సమయంలో తిరుమల లడ్డులు తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించ లేదని చెప్పడానికి వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారని, తప్పు చేయకపోతే తిరుమల శ్రీవారి పాదాల చెంత వైసీపీ నాయకులు, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చెయ్యడానికి ముందుకురావాలని జనసేన నాయకులు సవాల్ విసిరారు.
ఏడుకొండల స్వామి క్షమించు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ధీక్షకు మద్దతుగా ఈనెల 24వ తేదీన గుంటూరులోని గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 111 మంది జనసేన నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు ధీక్ష చేపడతారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దీక్ష అనంతరం అనంతవరం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసైనికులు ఆ దీక్ష విరమిస్తానని ఆ పార్టీ నాయకులుల సోమవారం మీడియా ముందు ప్రకటించారు.












Click it and Unblock the Notifications