ఏపీ మద్యం స్కాంలో అనూహ్య పరిణామం
Sajjala Sridhar Reddy: ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం సమక్షానికి ప్రవేశపెట్టగా మే 6వ తేది వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ పడింది.
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇదివరకే అరెస్ట్ అయ్యారు. అలాగే ఏ8గా ఉన్న రాజ్ కసిరెడ్డి తోడల్లుడు చాణక్య కూడా అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో తాజాగా ఏ6 గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విజయవాడకు తీసుకొచ్చారు.

ప్రొసీజర్ ప్రకారం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. వాదోపవాదాలను విన్న తరువాత న్యాయమూర్తి సిట్ అరెస్ట్‌ను సమర్థించారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీనితో సిట్ అధికారులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉన్నప్పుడు సంభవించినట్లుగా అనుమానిస్తోన్న మద్యం అమ్మకం, కొనుగోళ్లల్లో 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇటీవలే తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు.
మద్యం కుంభకోణంపై కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు సమర్పించారు. దీని తరువాత సీఐడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.
ఈ కేసులో వైఎస్ఆర్సీపీకి చెందిన రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇటీవలే- విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. వివరాలను అందించారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications