ఏపీలో మళ్లీ పెరిగిన కొత్త కరోనా కేసులు: వందకుపైగా మరణాలు, 2లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 15వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా వందకుపైగానే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 15,284 కరోనా కేసులు, 106 మరణాలు
తాజాగా నమోదైన 15,284 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 106 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 10,328కు చేరింది.

ఏపీలో రికవరీలు పెరగడంతో 2లక్షలదిగువకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 20,917 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 14,00,754కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 2,98,023 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,49,201 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2663 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కడపలో 436 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1034, చిత్తూరులో 1970, తూర్పుగోదావరిలో 2663, గుంటూరులో 802, కడపలో 436, కృష్ణాలో 568, కర్నూలులో 1387, నెల్లూరులో 648, ప్రకాశంలో 978, శ్రీకాకుళంలో 991, విశాఖపట్నంలో 1840, విజయనగరంలో 555, పశ్చిమగోదావరిలో 1412 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. తాజాగా, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక యాస్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications