శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే మరో గుడ్ న్యూస్..!
ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సీజన్ లో ఎన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా రద్దీ మాత్రం తగ్గకపోవడంతో ఇవాళ మరోసారి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లను విశాఖపట్నం నుంచి కేరళలోని కొల్లాంకు నడుపుతోంది. ఈ రైళ్లు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయి, మధ్యలో ఏయే హాల్ట్ లు ఇచ్చారన్న వివరాల్ని అధికారులు వెల్లడించారు.
విశాఖపట్నం నుంచి కేరళలోని కొల్లాంకు అయ్యప్ప భక్తుల కోసం రెండు వైపులా మొత్తం 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఇందులో 10 రైళ్లు విశాఖ నుంచి కొల్లాంకు, మరో 10 రైళ్లు కొల్లాం నుంచి విశాఖకు ప్రయాణిస్తాయి. ఈ నెల 18 నుంచి జనవరి 20 వరకూ విశాఖ నుంచి కొల్లంకు ప్రతీ మంగళవారం ఓ ప్రత్యేక రైలు చొప్పున మొత్తం 10 రైళ్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఈ నెల 19 నుంచి జనవరి 21 వరకూ కొల్లం నుంచి విశాఖకు ప్రతీ బుధవారం ఓ ప్రత్యేక రైలు చొప్పున మరో 10 రైళ్లు అందుబాటులో ఉంచారు.

ఇలా విశాఖ-కొల్లాం మధ్య ప్రకటించిన 20 ప్రత్యేక రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలార్ పెట్టాయ్, సాలెం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, కొట్టాయం, తిరువళ్ల,చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంచారు. కాబట్టి రేపటి నంచి వచ్చే రెండు నెలల్లో శబరిమల వెళ్లాలనుకునే అయ్యప్పస్వాములు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications