తెలుగు రాజకీయాల్లో దూసుకొస్తోన్న మరో జనసేన..!!
హైదరాబాద్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. వచ్చే సెప్టెంబర్-అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు లేకపోలేదు. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పటవుతుంది. వరుసగా మూడోసారి కూడా గెలవడానికి భారత్ రాష్ట్ర సమితి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బీఆర్ఎస్ కు ధీటుగా అటు కాంగ్రెస్, భారతీయ జనత పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోన్నాయి.

మూడు కొత్త పార్టీలు..
ఈ పరిణామాల మధ్య- మరి కొన్ని కొత్త రాజకీయ పార్టీలు తెర మీదికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి ఏకంగా మూడు పొలిటికల్ పార్టీలు ఈ ఎన్నికల ఏడాదిలో పుట్టుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాయవి. ఆయా పార్టీల నాయకులు తమ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపించారు. ప్రస్తుతం అవన్నీ పరిశీలన దశలో ఉన్నాయి.

తెలంగాణ కేంద్రంగా..
ఇందులో- జాతీయ జనసేన పార్టీ, తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ, అలయెన్స్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ ఉన్నాయి. దుగ్గిరాల రాజేశ్వర రావు అధ్యక్షుడిగా, గుడిగిరి మమత ప్రధాన కార్యదర్శిగా తమ పేర్లను కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అడ్రస్ ను ఇందులో పొందుపరిచారు. పార్టీ కేంద్ర కార్యాలయం జూబ్లీహిల్స్ లోనే ఏర్పాటు చేసేలా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.

ఇప్పుడున్న జనసేన..
ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ జనసేన పార్టీ విస్తృతంగా దృష్టి సారించింది. తరచూ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. ప్రతీవారం పవన్ కల్యాణ్ ఏపీలో జిల్లాల పర్యటనలను నిర్వహిస్తోన్నారు. జనసేన-జనవాణి కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ అవుతోన్నారు.

జాతీయ జనసేన పార్టీ..
ఈ పరిస్థితుల మధ్య కొత్తగా జాతీయ జనసేన పార్టీ- తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైకి దూసుకొస్తోండటం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ దశలో ఉందీ పార్టీ. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాదిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లోనైనా జాతీయ జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

తెలంగాణ సమాజ్ కాంగ్రెస్..
తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీని రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి కేంద్రంగా రిజిస్ట్రేషన్ చేయిస్తోన్నారు. ఈ పార్టీ అధ్యక్షుడిగా దోసేపల్లి నరహరి, ప్రధాన కార్యదర్శిగా రేగులపల్లి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఇక అలయెన్స్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి ఎం శేషగిరి రావు, ఎం రఘునాథ గౌడ్ అధ్యక్ష- ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తోన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ కేంద్రంగా ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది.












Click it and Unblock the Notifications