ఏపీలో భారీ వర్షాలు, వరదలతో 32 మంది మృతి: వారికి టాక్స్ మినహాయింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందారని తెలిపింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా, పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారని పేర్కొంది.
1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తెలిపింది. ఈ వరదల కారణంగా 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయినట్లు పేర్కొంది. 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్లు వెల్లడించింది. వరదల వల్ల 22 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించింది.

అంతేగాక, 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రభుత్వం తెలిపింది. వరదల కారణంగా 6,44,536 మంది నష్టపోయినట్లు పేర్కొంది. 193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని వివరించింది. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయని, ఆరు హెలికాఫ్టర్లు, 228 బోట్లు పని చేస్తున్నాయని తెలిపింది. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్లు పేర్కొంది. కృష్ణా నదికి 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందని ప్రభుత్వం తెలిపింది.
ఇది ఇలావుండగా, వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు (CEO Smart Andhra Pradesh Foundation)కు పంపవచ్చని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సీఈవో శివశంకర్ వెల్లడించారు. దీని ద్వారా విరాళాలు ఇస్తే (Corporate Social Responsibility) సీఎస్ఆర్ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయని వివరించారు. చెక్కులు, డీడీలను సీఈవో, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరుతో పంపవచ్చని వెల్లడించారు. విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు సర్టిఫికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్‌కు కోటి విరాళం ఇవ్వటం శుభపరిణామని శివశంకర్ తెలిపారు.
విరాళాల కోసం బ్యాంకు ఖాతా నెంబర్లు:
State Bank Of India:
A/C No: 38588079208
సీఎంఆర్‌ఎఫ్, ఎస్‌బీఐ బ్రాంచ్, ఏపీ సెక్రటేరియట్
SBI IFSC Code: SBIN0018884
Union Bank Of India:
A/C No: 110310100029039
సీఎంఆర్‌ఎఫ్, యూబీఐ బ్రాంచ్, ఏపీ సెక్రటేరియట్
UBI IFSC Code: UBIN0830798.












Click it and Unblock the Notifications