SBI: 30 ఏళ్ల క్రితం 80 పైసల ‘బెట్’.. ఇప్పుడు వేల కోట్ల ‘జాక్‌పాట్’
స్టాక్ మార్కెట్‌లో ఒక సామెత ఉంది.. "మంచి షేరును కొని ఓపిగ్గా దాచుకుంటే, అది ఒకరోజు మీ తలరాతను మారుస్తుంది" అని. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పుడు భారత కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత భారీ లాభాన్ని అందుకోవడానికి సిద్ధమైంది.
మూడు దశాబ్దాల క్రితం ఎస్‌బీఐ పెట్టిన కేవలం రూ. 2 కోట్ల పెట్టుబడి, నేడు అక్షరాలా రూ. 5,000 కోట్లకు పైగా విలువైన మహా సామ్రాజ్యంగా మారి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన 'నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్' (NSE) సుమారు రూ. 30,000 కోట్ల భారీ ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఆసక్తికరమైన 'జాక్‌పాట్' కథనం వెలుగులోకి వచ్చింది.

ఆ రోజుల్లో షేరు ధర కేవలం 80 పైసలే!
సాధారణంగా కంపెనీలు పబ్లిక్‌గా లిస్ట్ అవ్వడానికి స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటాయి. కానీ, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్‌ను అందించే 'NSE' సంస్థే స్వయంగా మార్కెట్లో లిస్ట్ అవ్వబోతోంది. 1993 నుంచి 1999 మధ్య కాలంలో, NSE ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎస్‌బీఐ అందులో పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలో సగటున కేవలం 80 పైసల ధరకే దాదాపు 2.48 కోట్ల NSE షేర్లను ఎస్‌బీఐ కొనుగోలు చేసింది. ఆ రకంగా బ్యాంక్ పెట్టిన మొత్తం పెట్టుబడి కేవలం రూ. 1.98 కోట్లు మాత్రమే.
ముప్పై ఏళ్లుగా ఆ షేర్లను అలాగే ఉంచుకున్న ఎస్‌బీఐకి, ఇప్పుడు అదృష్టం ఊహించని రూపంలో తలుపు తట్టింది. ప్రస్తుతం అన్‌లిస్టెడ్ మార్కెట్ (గ్రే మార్కెట్) లో NSE ఒక్కో షేరు ధర సుమారు రూ. 2,055 పలుకుతోంది. ఈ లెక్కన రాబోయే ఐపీఓలో ఎస్‌బీఐ తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా దాదాపు రూ. 5,086 కోట్లను తన జేబులో వేసుకోనుంది. అంటే పెట్టిన పెట్టుబడిపై ఏకంగా 2,56,000 శాతం లాభం (పెట్టిన డబ్బుకు 2,568 రెట్లు ఎక్కువ) అన్నమాట! పైగా, ఇది కేవలం అమ్మే వాటా ద్వారా వచ్చే లాభం మాత్రమే.. మిగిలిన షేర్లు ఎస్‌బీఐ వద్దే ఉండటంతో భవిష్యత్తులో ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాదు.. వీరికి కూడా పండగే!
NSE ఐపీఓ పుణ్యమా అని కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాదు, మరికొన్ని ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థలు కూడా కుబేరులుగా మారబోతున్నాయి:
న్యూ ఇండియా అస్యూరెన్స్ & నేషనల్ ఇన్సూరెన్స్:
ఈ సంస్థలు ఆ రోజుల్లో కేవలం 32 పైసలకే NSE షేర్లను కొనుగోలు చేశాయి. ఇప్పుడు వీరు పొందే లాభం ఏకంగా 6,400 రెట్లు పైమాటే అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ దిగ్గజాలు:
సింగపూర్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ 'టెమాసెక్', అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం 'మోర్గాన్ స్టాన్లీ'లు కూడా ఈ ఐపీఓ ద్వారా భారీగా లాభపడనున్నాయి.
దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర..
నిజానికి NSE షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్ల వద్ద కాగితాల రూపంలో (ఆన్ పేపర్) ఎప్పటి నుంచో వేల కోట్ల సంపద ఉంది. కానీ, దానిని నగదుగా మార్చుకునే అవకాశం వారికి దక్కలేదు. NSE సంస్థ మొదట 2016లోనే ఐపీఓకి రావాలని ప్రయత్నించినప్పటికీ, కొన్ని సాంకేతిక, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ ప్లాన్ వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు దశాబ్ద కాలం నాటి నిరీక్షణకు తెరదించుతూ NSE పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధం కావడంతో, ఇన్వెస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, లాభాలను లాక్ చేసుకోవడానికి మార్గం సుగమమైంది. స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కి ఉన్న పవర్ ఏంటో ఎస్‌బీఐ సాధించిన ఈ అద్భుత విజయమే మార్కెట్ ప్రపంచానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.














Click it and Unblock the Notifications