సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
రాష్ట్రంలో సంచలనంగా మారిన సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు సీఐ పైన హత్యాయత్నం కేసు నమోదు చేసారు. సీఐ అరెస్ట్ కు రంగం సిద్దం అయింది. ఇదే సమయంలో ఈ కేసుకు ప్రత్యేక అధికారిని నియమించిన ప్రభుత్వం..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాశ్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్పీలతో ఈ కమిటీ నియమించింది. ఇందులో పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నన్ నయీమ్ అస్మీ, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్ సుధాకర్ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని రంగంలోకి దించింది. ప్రాధమిక సమాచారం సేకరించారు. అటు సీఎం చంద్రబాబు సాయికృష్ణ తల్లితో పాటుగా కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని.. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయటంతో పాటుగా హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

కొనసాగుతున్న విచారణ.. సీఐ అరెస్ట్ కు రంగం సిద్దం
కాగా, సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరో వైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆదివారం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణ లంక పోలీస్టేషన్‌లో స్టేషన్ సిబ్బందితోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కృష్ణ లంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బంది నుంచి పటమట సీఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు. ఆ క్రమంలో మే 23 నుంచి 25వ తేదీ వరకు అనాథ మృతదేహాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అదే సమయంలో బస్టాండు నుంచి స్వర్గపురి వరకు ఉన్న సీసీ టీవీ కెమెరాలను కూడా గుణదల సీఐ పరిశీలించారు.












Click it and Unblock the Notifications