అధికారం దక్కాలంటే- ఆ 34 సీట్లే : జగన్ సైలెంట్ ఆపరేషన్: టీడీపీ -పవన్ కలిస్తే జరిగేదిదే..!!
వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కాలంటే గోదావరి జిల్లాల్లోని ఆ 34 నియోజకవర్గాలే కీలకం. పొత్తులు మొత్తం ఫలితాలనే మార్చేసే అవకాశం. ఈ నియోజకవర్గాలపైనే అక్కడే ఇప్పుడు సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల తరహాలోనే మెజార్టీ సీట్లు అక్కడ దక్కించేలా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. చంద్రబాబు ఇప్పటికే అక్కడ పర్యటనలు ప్రారంభించారు. పాత ప్రజారాజ్యం లో పని చేసిన వారితో సహా..ఇతర పార్టీల్లోని నేతలతో జనసేన నేతలు రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కొత్త రాజకీయం మొదలైంది. ఈ స్థానాల్లో ఎవరికి మెజార్టీ సీట్లు దక్కితే వారికే అధికారం.

గోదావరి గట్టున మారుతున్న రాజకీయం
గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014 ఎన్నికల్లో జనసేన -టీడీపీ పొత్తుతొ పశ్చిమ గోదావరిలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 12 టీడీపీ, 5 వైసీపీ, 1 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పశ్చిమ గోదావరిలో టీడీపీ కేవలం రెండు స్థానాలు పరిమితం అయింది.
తూర్పు గోదావరి లీ టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా, 1 జనసేన గెలిచింది. మిగిలిన స్థానాలు వైసీపీ గెలుపొందింది. టీడీపీకి 39.7 శాతం పోలయ్యాయి. వైసీపీకి 53.3 శాతం ఓట్లు దక్కాయి. జిల్లాలో జనసేన ఒకే సీటు గెలిచినా 14.84 శాతం ఓట్లు దక్కించుకుంది. అదే విధంగా పశ్చిమ గోదావరిలో వైసీపీ 12 స్థానాల్లో గెలిచి 46.35 శాతం ఓటింగ్ దక్కించుకుంది.
టీడీపీకి 36.30 ఓట్లు దక్కగా, జనసేనకు పశ్చిమలో 11.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కల పరంగా టీడీపీ - జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీకి గతం కంటే కొంత తగ్గినా.. అధిక్యత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైతే లెక్కలు మారే అవకాశం ఉంది.

నాలుగు వర్గాలపై సీఎం జగన్ ఫోకస్
ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సారి పట్టు కోసం సీఎం జగన్ ముందస్తు వ్యూహాలు అమలు చేస్తున్నారు. పవన్ ఫ్యాక్టర్ తో ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా అడుగులు వేస్తున్నారు. బీసీ , ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంకు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలోని కాపు నేతలకు తిరిగి సీట్లు ఇవ్వటంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ కుటుంబ సభ్యులను వైసీపీలోకి తెచ్చేందుకు నిర్ణయించారు. కాపులకు ఏ విధంగా మేలు చేస్తుందీ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఇక్కడ మెజార్టీ వర్గాల పైన వైసీపీ ఆశలు పెట్టుకోవటం.. కాపు సామాజిక వర్గం ఈ సారి ప్రధానంగా జనసేన వైపు చూస్తోందనే ప్రచారం నడుమ టీడీపీ తమ ఓట్ బ్యాంకు పదిలం చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది.
జనసేన- టీడీపీ పొత్తు ఖాయమైతే గోదావరి జిల్లాల్లో వైసీపీతో ఈ రెండు పార్టీల రాజకీయ పోరు హోరా హోరీగా ఉండటం ఖాయం. 2019 తరహాలో ఏకపక్షంగా ఉండనేది గత ఓటింగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

పవన్ కొత్త స్ట్రాటజీ - జగన్ కౌంటర్ ఆపరేషన్
ఈ సారి పవన్ కల్యాణ్ పొత్తు సంగతి ఎలా ఉన్నా..ముందుగా తన పార్టీ బలం పెంచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రజారాజ్యంలో తమతో కలిసి పని చేసి..ప్రస్తుతం దూరమైన వారిని తిరిగి దగ్గర చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో తూర్పు గోదావరిలో ప్రజారాజ్యం నాలుగు స్థానాలు గెలవగా, 8 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది.
అందులో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినా..మెగాస్టార్ ఛరిష్మాతో ఆ స్థాయిలో ఓట్లు సాధించారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటుగా ప్రజారాజ్యం నేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి. ఇక, టీడీపీకి చెప్పుకోదగిన ఓట్ బ్యాంక్ ఉన్నా.. 2019 లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ముందు ఓటమి తప్పలేదు. దీంతో, ఈ రెండు పార్టీలు కలవాలని క్షేత్ర స్థాయిలో రెండు పార్టల నేతలు కోరుకుంటున్నారు.
అదే జరిగితే ఈ రెండు జిల్లాలోని 2019 ఎన్నికల ఓట్ షేరింగ్ రెండు పార్టీల పొత్తుతో వైసీపీతో ఢీ అంటే ఢీ అని పోరాడే పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో దక్కిన ఓటింగ్ శాతమే దీనిని స్పష్టం చేస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో చోటు చేసుకొనే రాజకీయం ఎవరిని అధికారానికి దగ్గర చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications