రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొక్కిసలాట: 35 మంది మృతి, అసలేం జరిగింది, ఎవరు బాధ్యులు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: భక్తి పారవశ్యంతో నిండిపోవాల్సిన గోదావరి మహా పుష్కరాల ప్రాంతం అత్యంత దయనీయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పుష్కరాల్లో మహా విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉంది.

మరో 25 మంది అత్యవసర చికిత్సను పొందుతున్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అసలేం జరిగింది అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న. ఈ తొక్కిసలాట ఘటన వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గోదావరి పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అనుకోవడంలో తప్పులేదని కానీ ఆచరణలో అనుభవజ్ఞులను, నిపుణులను ఇందులో భాగస్వామం చేయడంలో విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాలు కోసం ఏపీ ప్రభుత్వం రూ. 1500 కోట్లను ఖర్చుపెట్టినా కొన్ని విషయాల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శించింది.

తొక్కిసలాటకు ప్రధాన కారణం?

35 killed in stampede at Godavari Pushkaralu in Andhra pradesh

గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో స్నానం చేసేందుకు ఉన్న చాలా ఘాట్లు ఉన్నాయి. కానీ, వాటిలో ముఖ్యమైనవి కోటిలింగాలు, కోటగుమ్మం పుష్కర ఘాట్స్. రాజమండ్రిలో బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ ఘాట్లకు ఉదయం 4.30 గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.

మంగళవారం ఉదయం 6.29 నిమిషాలకు మహా పుష్కరాలకు ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. దీంతో పుణ్యస్నానాలు ఆచరించడానికి, చిన్నారులతో వేల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌కు రానున్నారని తెలియడంతో వేలసంఖ్యలో చేరుకున్న భక్తులందరినీ అధికారులు నిలిపేశారు.

వీఐపీల కోసం ఏర్పాటు చేసిన గేట్లన్నింటనీ మూసేశారు. సీఎం చంద్రబాబు ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకూ అంటే దాదాపు గంటన్నర సేపు కుటుంబంతో పుష్కర స్నానమాచరించారు. ఈ సమయంలో ఉదయం 4.30 గంటలకు వచ్చిన భక్తులంతా అక్కడికి ఘాట్లకు చేరుకున్నారు.

సీఎం చంద్రబాబు ఘాట్ నుంచి వెళ్లిపోగానే గేట్లను తెరిచారు. మొత్తం మూడువైపుల భక్తులు నుంచి ఒక్కసారిగా ఘాట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెనుక ఉన్నవారంతా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఘాట్ మెట్లపై ఉన్న వారు భక్తుల కాళ్ల కింద నలిగిపోయారు.

35 killed in stampede at Godavari Pushkaralu in Andhra pradesh

ఈ తొక్కిసలాటలో చాలా మంది గోదావరిలో స్నానాలు చేస్తున్న వారిపై పడటంతో స్నానాలు చేస్తున్న వారు నీళ్లలో మునిగి, పైకి లేవలేక, ఊపిరాడక మరణించారు. తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు మరణించడంతో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.

బాధితులకు సహాయం చేద్దామన్నా సిబ్బంది తక్కువగా ఉండటం, క్షతగాత్రులు వందకు పైగా ఉండటంతో వారికి సాయం చేయడం అధికారుల వల్ల కాలేదు. పుష్కర ఘాట్ల వద్ద ఉన్న అంబులెన్స్ లు సరిపోకపోవడంతో కొన ఊపిరతో ఉన్న కొంత మంది సరైన సహాయక చర్యలు అందక చనిపోయారు.

తొక్కిసలాట జరిగిన రెండు గంటల వరకు మృతదేహాలు ఘటనా స్ధలం వద్దే ఉండిపోయాయి. ఇదంతా చూస్తుంటే తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం అధికారుల వైఫల్యమేనని తెలుస్తోంది. గోదావరి పుష్కరాలకు విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రభుత్వం అందుకు సరిపడ భద్రతా ఏర్పాట్లను భక్తులకు కల్పించడంలో విఫలమైంది.

అందుకుగాను అమాయకులైన భక్తులు అత్యంత ఘోరంగా మృతి చెందారు. కళ్ల ముందే తమ వారు జనం కాళ్ల కింద పడి నలిగి పోతుంటే బాధితుల బాధలు వర్ణనాతీతం. మృతుల్లో ముసలి వాళ్లు, మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి దీనంగా రోదిస్తున్న దృశ్యాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.

రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో తేలిగ్గా తీసుకోరాదని ఆయన అధికారులను హెచ్చరించారు.

భక్తులు సంయమనం పాటించాలని, 12 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా, ఏ ఘాట్‌లో చేసినా ఒక్కటేనని, అవసరమైతే తాను ఈ 11 రోజులు ఇక్కటే ఉంటానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. అందరు ఒకే ఘాట్ వద్దకు వచ్చే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ ఘాట్‌లో స్నానం చేసినా ఒక్కటేనని గుర్తించాలన్నారు.

పోలీసుల సూచనలను భక్తులు పాటించాలని కోరారు. ఘాట్‌ల వద్ద భక్తులు క్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. మృతి చెందిన వారిని తీసుకు రాలేమని, కానీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మా పైన ఉందని చెప్పారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్రకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. భక్తులు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ వారిని కోల్పోయామని చెబుతున్నారు.

English summary
At least 36 people were killed and dozens injured on Tuesday in a stampede during the mahapushkaram, a Hindu religious bathing festival on the Godavari river bank, in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X