ఏపీలో 15వేలు దాటిన కరోనా కేసులు, మరో ముగ్గురు మృతి: జిల్లాల వారీగా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో విదేశాలకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి 39 కేసులు ఉన్నాయి.

15వేలు దాటిన కరోనా కేసులు.. 193కు చేరిన మరణాలు
పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 15,252 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 193కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6998కి చేరింది. ప్రస్తుతం వివిధ కరోనా ఆస్పత్రుల్లో 8071 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు
కాగా, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 118, కర్నూలులో 90,
తూర్పుగోదావరిలో 80, గుంటూరు జిల్లాలో 77, కడపలో 60, కృష్ణా జిల్లాలో 52, చిత్తూరులో 35, నెల్లూరు జిల్లాలో 33, ప్రకాశం జిల్లా 28, విశాఖపట్నంలో 21, పశ్చిమగోదావరి జిల్లాలో 15, విజయనగరంలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2045 పాజిటివ్ కేసులు, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 1689కు చేరాయి. కృష్ణా జిల్లాలో 1519 కేసులున్నాయి.
Recommended Video

దేశ వ్యాప్తంగా 6 లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో బుధవారం మధ్యాహ్నం వరకు 5,86,956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,21,097 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 3,48,376 మంది కోలుకున్నారు. 17,417 మంది కరోనా బారినపడి మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,74,761 కరోనా కేసులు నమోదు కాగా, తమిళనాడులో 90,167ల కేసుతున్నాయి. ఢిల్లీలో 87వేలకు పైగా, గుజరాత్ రాష్ట్రంలో 32వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications