లక్ష చీరలతో 90 అడుగుల శ్రీ సుందర వస్త్ర మహా గణేష.. మన ఏపీలోనే!
వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఆగస్ట్ 27వ తేదీన దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా వాడ వాడలా వివిధ రకాల గణనాథులు కొలువు తీరనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈసారి పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ప్రాంతంలో వెరైటీ గణనాధుని సిద్ధం చేస్తున్నారు.
వినాయక విగ్రహాల ఏర్పాటులో గాజువాకకు ప్రత్యేక స్థానం
గాజువాకలో వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చాలా ప్రత్యేకమైన, వినూత్నమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటంలో గాజువాకకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎత్తైన 117అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత కూడా గాజువాకకే దక్కింది. అయితే ఈ సారి కూడా గాజువాకలో లకా గ్రౌండ్స్ లో శ్రీ సుందర వస్త్ర మహా గణేష పేరుతో ఈసారి లక్ష చీరలతో 90 అడుగుల గణనాథుడిని గణేశ నవరాత్రి వేడుకలకు సిద్ధం చేశారు.

లక్ష చీరలతో గణనాధుడు
ఈ గణనాథుడిని రూపొందించడానికి ముంబై, చెన్నై, సూరత్ తదితర ప్రాంతాల నుండి చీరలను సేకరించారు. అయితే ఈసారి గణేశ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడిని రెండు మూడు రకాల ఆహార పదార్థాలతో తయారు చేయాలని భావించినా, ఆ తర్వాత ఆహార పదార్థాలు పాడైపోతాయి అన్న ఆలోచనతో చీరలతో గణనాధుని తయారు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా లక్ష చీరలతో చాలా చక్కని అందమైన 90 అడుగుల గణనాథుడిని రూపొందించారు.
దేశంలోనే చీరలతో తొలిసారి గణనాధుడు
ఈ గణనాథుడిని రూపొందించడానికి ఉపయోగించిన చీరలను, నిమజ్జనం అనంతరం భక్తులకు పంచనున్నారు. దేశంలోనే చీరలతో గణేశ విగ్రహాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకపక్క పర్యావరణాన్ని రక్షించాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించ వద్దని ప్రభుత్వాలు పదేపదే ప్రచారం చేస్తున్న క్రమంలో, చీరలతో గణనాథుని రూపొందించడం పర్యావరణ పరిరక్షణలో ఒక అడుగు అని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ గణనాధుడి పూజ కూడా అంతా ప్రత్యేకమే
ఇక ఈ గణనాథుడిని పూజించడానికి ఒక టన్ను పసుపు, ఒక టన్ను కుంకుమ, టన్ను విభూది, టన్ను పువ్వులను ఉపయోగించనున్నారు. గణేశ నిమజ్జనం రోజు 5 టన్నుల లడ్డును భక్తులకు పంచనున్నారు. ప్రస్తుతం ఈ గణ నాధుడిని చూడటానికి గాజువాక ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications