మరో ఘోరం: ఇంట్లో ఉన్న చిన్నారిపై నాలుగు కుక్కల దాడి, తీవ్రగాయాలతో మృతి
శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. తాజా,
ఇంట్లో ఉన్న చిన్నారిపై నాలుగు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆమె మెడ, ముఖంపై దారుణంగా కరిచాయి. కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స ప్రారంభించిన కాసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలోని జి. సిగడాం మండలం మెట్టవలసలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి సాత్విక(16 నెలలు) కుక్కల దాడిలో మరణించడంతో ఆమె తండ్రి రాంబాబు, తల్లి రామలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీధి కుక్కలను అరికట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు దాడులు ఇటీవల పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఓ నాలుగేళ్ల బాలుడిపై ఒ కుక్కల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో పలువురు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కుక్కలు దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు కుక్కల దాడిలో గాయపడ్డారు. వీధి కుక్కలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే గాక, దేశ వ్యాప్తంగా కూడా వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వృద్ధుడిపై దాడి చేసిన కుక్కల గుంపు అతడి ప్రాణం తీశాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో సంచరిస్తున్న వృద్ధుడిపై ఒక్కసారిగా కుక్కల గుంపు దాడి చేసింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ వృద్ధుడు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఐదారు కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో అతడు కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కూడా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో 65 ఏళ్ల డాక్టర్ సఫ్దర్ అలీ అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.












Click it and Unblock the Notifications