వీడియో: శ్రీవారికి అరుదైన బహుమతి: క్యూ లైన్‌లో..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. 31 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. మంగళవారం 76,555 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,488 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

ఇక సెప్టెంబర్‌లో స్వామివారి విశేష ఉత్సవాలను నిర్వహించబోతోన్నారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు. ఈ నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ఇవ్వాళ పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. లలిత జ్యువెలరీస్ సంస్థ ఛైర్మన్ కిరణ్ కుమార్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలేశుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. నిత్యం శ్రీవారి మూల విరాట్టుకు నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవ కోసం కిరణ్ కుమార్.. 108 పసిడి కమలాలను సమర్పించారు. వాటిని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు.

ప్రతిరోజూ తెల్లవారు జామున 6 గంటల నుంచి 7 గంటల వరకు మూల విరాట్టుకు అష్టదళ పాద పద్మారాధన సేవ చేయడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ పాలక మండలిని నెలకొల్పి గోల్డెన్ జూబ్లీ పూర్తయిన సందర్భంగా తొలిసారిగా 1984లో అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రారంభించారు.
అప్పట్లో గుంటూరుకు చెందిన ఓ ముస్లిం భక్తుడు శ్రీవారికి 108 బంగారు కమలాలను సమర్పించారు. ఆ కమలాలతో అష్టదళ పాద పద్మారాధన ఆరంభమైంది. ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా కిరణ్ కుమార్ 108 పసిడి కమలాలను స్వామివారికి సమర్పించారు.
108 నామాలతో శ్రీవారిని స్తుతిస్తూ ఒక్కో పేరుకు ఒక్కో పుష్పాన్ని సమర్పిస్తుంటారు. ఈ సేవలో పాల్గొనదలచుకున్న భక్తులు 1,250 రూపాయలతో అడ్వాన్స్‌గా టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు పెద్ద లడ్డూలు, రెండు వడ ప్రసాదం, స్వామివారి ఉత్తరీయం, మహిళలకు అమ్మవారి బ్లౌజ్‌ను అందజేస్తారు.












Click it and Unblock the Notifications