చనిపోయిన స్నేహితురాలు పిలుస్తోందని.. బావిలో పడి విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు: బావిలో పడి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జిల్లాలోని పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. కొంత కాలం క్రితం చనిపోయిన తన స్నేహితురాలు తనను రమ్మని పిలుస్తోందని, లేదంటే అందర్నీ చంపేస్తానని బెదిరింపులకు గురి చేస్తోందని ఆ విద్యార్థిని తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అందరికీ హాని కలగకూడదనే తాను ఆత్మహత్య చేసుకుని, తన స్నేహితురాలి వద్దకు వెళుతున్నాని తెలిపింది.
ఘటనకు సంబంధించి తన స్నేహితులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు పట్టణంలోని ప్రకాశం కాలనీకి చెందిన సత్యనారాయణ కుమార్తె కల్పన(16) పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
కాగా, కల్పనకు చిన్నతనం నుంచి అదే కాలనీకి చెందిన శ్రీనివాసులు కుమార్తె మమత మంచి స్నేహితురాలు. ఈ ఏడాది జూలై 25వ తేదీ ఉదయం మమత ఇంటిలో అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది.

ఈ నేపథ్యంలో కల్పన బుధవారం ఉదయం బావిలోపడి ఆత్మహత్య చేసుకుంటానని లేఖరాసి తన నివాసంలో పెట్టింది. ఆ తర్వాత పత్తెమ్మగారిపల్లె సమీపంలోని పటాలమ్మ ఆలయం వద్ద ఉన్న బావిలోపడి మృతి చెందింది.
గత కొన్ని నెలల క్రితం మృతిచెందిన అదే కాలనీకి చెందిన మమత తనకు ఎవ్వరూ తోడు లేరని, తనను రమ్మని పిలుస్తోందని, రాకపోతే కాలనీలో అందరినీ చంపుతానని బెదిరిస్తోందని, తన వల్ల ఎవ్వరూ మృతి చెందకూడదని భావించి తన స్నేహితురాలి వద్దకు వెళ్తున్నట్లు కల్పన లేఖ రాసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కల్పన చనిపోవడంతో ఆమె కుటుంబీకులు, కాలనీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. మూఢనమ్మకాలతో బాలిక విలువైన ప్రాణాన్ని తీసుకోవడం అందరికీ ఆవేదన కలిగించింది. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications