అతని విషయమై చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక మంత్రాంగం... ఓకే అన్న బాబు
ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు మరికొన్ని నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. దీనికోసం ఆయన బాబుతో చర్చించగా.. బాబు కూడా ఓకే చెప్పారు. ప్రపంచానికి ఎన్నో ఔషధాలను ఇచ్చి మానవాళికి మహోపకారం చేసిన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బరావు పేరును రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ వైద్యకళాశాలకు పెట్టాలని చంద్రబాబుతో అన్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను పవన్ చంద్రబాబుకు అందజేశారు.
తెలుగు తేజాన్నిగౌరవించుకోవాలి
పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనను చంద్రబాబునాయుడు మెచ్చుకున్నారు. వెంటనే దీన్ని పరిశీలించాలంటూ వైద్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు భీమవరంలో జన్మించారు. విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. దీంతో ఏలూరు, రాజమండ్రిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒకదానికి యల్లాప్రగడ పేరు పెట్టనున్నారు. అటువంటి తెలుగు తేజాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు, పవన్ అన్నారు.

కీమోథెరపీకి ఔషధాన్ని కనుగొన్నారు
టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ అరియోమైసిన్ ను తొలిసారిగా కనుగొన్నది కూడా యల్లాప్రగడ సుబ్బారావే. బోదకాలు వ్యాధి (పైలేరియా)కు సంబంధించి హెట్రజాన్, క్షయ వ్యాధిని నిరోధించడానికి ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజెడ్ ఔషధాలను కూడా ఆయనే కనుగొన్నారు. తెలుగువారికే ఆయన గర్వకారణమని పవన్ కొనియాడారు. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి ఉపయోగించే ఔషధాల్లో తొలితరం డ్రగ్ మెథోట్రెస్సెట్‌ను మరో సైంటిస్ట్ తో కలిసి అభివృద్ధి చేసి క్యాన్సర్ రోగులకు ఊరట కల్పించారు. ఏలూరు, రాజమండ్రి కళాశాలలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఏ కళాశాలకు డాక్టర్ యల్లాప్రగడ పేరు పెడితే బాగుంటుందనే విషయాన్ని నిర్ణయిస్తామని వైద్యశాఖాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications