ఖేలో ఇండియాలో వెయ్యి కోట్ల నిధులు.. కేంద్రానికి ఏపీ మంత్రి వినతి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతను క్రీడారంగం వైపు మళ్ళించి, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పించి గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఆలోచనలో అనేక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడలలో ముందు ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖేలో ఇండియా పథకం కింద వెయ్యి కోట్లు మంజూరుకు కేంద్రానికి విజ్ఞప్తి
ఏపీలో యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా పథకం కింద వెయ్యి కోట్లు మంజూరు చేయాలని తాజాగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో ఆధునిక ఫుట్బాల్ టర్ఫ్ నిర్మాణానికి రూ.42.62 కోట్ల కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అయిన వినీల్ కృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఖేలో ఇండియా నిధులతో చేసేది ఇదే
ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, మల్టీపర్పస్ హాల్స్, ఫుట్బాల్ మైదానాలు, అథ్లెటిక్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటి అంతర్జాతీయ సౌకర్యాలు క్రీడాకారుల కోసం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాను స్పోర్ట్స్ హబ్ గా అభివృద్ధి చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ విజ్ఞప్తి
ఇదే సమయంలో భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ తో కూడా మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని స్థాపించాలని ఆయన కోరారు యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా అధునాతన శిక్షణ అందించాలని తాము ఆలోచిస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలు క్రీడలలో రాణించేలా వసతులకల్పన
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తే యువత ఆసక్తి క్రీడల వైపు మళ్ళుతుంది అని, ఫలితంగా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని, భవిష్యత్తు తరాలు క్రీడలలో రాణిస్తాయి అని మంత్రి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖేలో ఇండియా వంటి కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర క్రీడ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో క్రీడా సౌకర్యాలు అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం కేంద్రం నుండి ఆశించిన సహాయం అందితే క్రీడారంగంలో ను మరింత ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications