కాళ్లు, చేతులు కట్టేసి పాలిటెక్నిక్ విద్యార్థి హత్య
విశాఖపట్నం: జిల్లాలోని పెందుర్తి మండలం పులగానిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిల్లి వినయ్ అనే ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి ఊపిరితీశారు.
అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న పొలంలో పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. యువకుడి మృతి ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
యువకుడిపై ప్రత్యర్థుల దాడి

ప్రకాశం జిల్లా శానంపూడిలో జరిగిన మరో సంఘటనలో మురళి అనే యువకుడిని ప్రత్యర్థులు గొడ్డలితో నరికారు. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కళాశాల బస్సు, కారు ఢీ: ఒకరి మృతి
గుంటూరు జిల్లా మేడికోడూరు మండలం పేరేచర్ల వద్ద బుధవారం ఉదయం కళాశాల బస్సు, కారు ఢీకొన్నాయి. ఆరో మైలు వద్ద పెట్రోలు బంకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
యర్లపాడు మండలం లింగారావుపాలెం వద్ద చైతన్య లిటిల్స్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని, డ్రైవర్, తిరుమావుళ్లకు చెందిన ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వారిని యర్లపాడు, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications