ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తే..
Vijayasai Reddy: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్- వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఉమ్మడిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనాలని నిర్ణయించాయి. ఏపీ కాంగ్రెస్‌తో కలిసి వామపక్ష పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి.
చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఇప్పటికే జనసేన సహకారాన్ని తీసుకుంటోన్నారు. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీని కూడా చేర్చడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు కుదురిందంటూ వార్తలు వస్తోన్నాయి గానీ.. అధికారికంగా బీజేపీ నేతలెవరూ దీన్ని ప్రకటించట్లేదు.

ఈ పరిణామాలతో వామపక్ష పార్టీలు.. టీడీపీకి దూరం కావాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నాడని, అమరావతి ఉద్యమంలో అండగా నిలిచి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తమకు ఆయన గుణపాఠం చెప్పారనే అభిప్రాయం వామపక్ష నేతల్లో వ్యక్తమౌతోంది.
వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జరగబోయేదేమిటో క్లియర్‌గా తెలియజేశారు. ఎలాంటి ఫలితమూ ఉండబోదని తేల్చి చెప్పారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ.. నోటాతో పోటీ పడుతోందని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అయిదో స్థానంలో నిలవడానికి నోటాతో ఢీ కొడుతోందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో నోటా చేతిలో 32,505 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. ఆ పార్టీ తరఫున గెలిచే ఎమ్మెల్యేలు తేలిగ్గా లొంగిపోతారని, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఇదే జరిగిందని అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది మురిగిపోతుందని, వృధా అవుతుందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్తోన్న వైఎస్ఆర్సీపీ ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీకి పడే ప్రతి ఓటు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications