కూటమి లెక్కల్ని మార్చబోతున్న ఏబీ వెంకటేశ్వరరావు? గెలిచినా, ఓడినా?
విజయవాడ మేయర్ ఎన్నికల్లో అత్యంత వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు (AB Venkateswara Rao) చుట్టూనే ఇప్పుడు రాజకీయం అంతా తిరుగుతోంది. మేయర్ అభ్యర్ధులుగా కూటమి తరఫున జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ తరఫున సిట్టింగ్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పోటీ ఖరారు అయిన తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలోకి దిగిన ఏబీ వెంకటేశ్వరావుకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇప్పుడు విజయవాడతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల, అలాగే సోషల్ మీడియాలో సైతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏబీ గెలిస్తే ఏం జరుగుతుంది, ఓడితే ఏం జరుగుతోందో ఓసారి చూద్దాం..
ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీ (AB Venkateswara Rao)
ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ బరిలో నిలవాలన్న ఆలోచన వెనుక కమ్యూనిస్టుల ప్రతిపాదన, కాంగ్రెస్ మద్దతు ఉందని పైకి చెబుతున్నా.. అంతకు మించిన సమీకరణాలు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం కూటమి అభ్యర్ధిగా చంద్రబాబు ఎంపిక చేసిన మాజీ టీడీపీ, ప్రస్తుత జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ. ఈ ఎంపిక వల్ల చంద్రబాబుకు రెండు అవకాశాలున్నాయి. రాధా గెలిస్తే కూటమి జనసేనకు మద్దతుగా నిలిచిందనని చెప్పుకోవచ్చు. ఓడితే కమ్మ సామాజిక వర్గం ఓట్లు కాపు నేత అయిన రాధాకు బదిలీ కాలేదని చెప్పేయవచ్చు. భవిష్యత్తులో విజయవాడలో కాపులకు, వంగవీటి రాధాకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. అదే సమయంలో వైసీపీ కూడా బీసీ మహిళ అయిన రాయన భాగ్యలక్ష్మిని బరిలోకి దింపడంతో ఇక్కడ ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గాన్ని, వారిలో అసంతృప్తిని క్యాష్ చేసుకునే ఒకరి అవసరం ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీ పనికొస్తోంది.

ఏబీ మేయర్ గా గెలిస్తే..?
ఈసారి ప్రత్యక్ష విధానంలో జరుగుతున్న మేయర్ ఎన్నికల్లో విజయవాడ నుంచి ఏబీ వెంకటేశ్వరావు అనూహ్యంగా విజయం సాధిస్తే.. అది ఆయనతో పాటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో ఇండియా కూటమికి ఊపిరి పోసినట్లవుతుంది. కానీ రాధా ఓడిపోతే మాత్రం ఆ శాపం టీడీపీకి చుట్టుకోవడం ఖాయం. చంద్రబాబు సొంత సామాజిక వర్గం కోసం కాపు నేత అయిన రాధాను ఓడించారన్న అపప్రద మోయక తప్పదు. అందుకే ఇప్పుడు టీడీపీ శ్రేణులతో పాటు కమ్మ సామాజిక వర్గం జనం కూడా ఇష్టం లేకపోయినా రాధాను సమర్ధించాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. రాధా ఓడిపోతే మాత్రం వీరందరికీ ఆయన గెలుపు ఇష్టం లేదని భావించవచ్చు.ఈ ప్రభావం కచ్చితంగా కూటమిపై రాష్ట్రవ్యాప్తంగా పడుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో టీడీపీకి కాపులు దూరమయ్యే అవకాశం ఉంటుంది.

ఏబీ మేయర్ గా ఓడిపోతే..?
ఒకవేళ ఏబీ వెంకటేశ్వరావు ముక్కోణపు పోరులో ఓడిపోతే మాత్రం పరిస్దితులు వేరేగా ఉంటాయి. కాపు నేత అయిన వంగవీటి రాధాను జనసేనలోకి పంపి మేయర్ గా నిలబెడితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గంతో పాటు ఆయన సొంత సామాజిక వర్గం ఓట్లు కూడా పడి గెలుస్తారని చంద్రబాబు అంచనా వేశారు. ఈ అంచనా నిజమై ఏబీ వెంకటేశ్వరరావు ఓడిపోతే .. కమ్మ సామాజిక వర్గం టీడీపీకి పూర్తి మద్దతుగా ఉందని, అలాగే కాపులకు కూడా టీడీపీ అండగా నిలబడుతుందన్న వాదన బలపడుతుంది. ఇది కచ్చితంగా కూటమి బలపడేందుకు పనికొస్తుంది. అలాగే రాష్ట్రంలో జనసేన బలపడేలా చేస్తుంది. రాధా మేయర్ అయిన తర్వాత రాజకీయాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే రాష్ట్రంలో కూటమి బలోపేతానికి ఇది కచ్చితంగా పనికొస్తుంది. అందుకే ఏబీ వెనుక జగన్, వైసీపీ ఉన్నాయన్న ప్రచారాన్ని కూటమి పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు కోసం పనిచేసి జగన్ బాధితుడుగా మారిన ఏబీ.. ఆ తర్వాత అదే చంద్రబాబు బాధితుడిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఏబీ గెలుపు కోసం జగన్ మద్దతిచ్చే అవకాశాలు తక్కువ. అయితే ముక్కోణపు పోటీలో రాధాను ఓడిస్తే కూటమి ముక్కలు కావడం ఖాయమని భావిస్తే మాత్రం తెరవెనుక ఓట్లు వేయించవచ్చని విశ్లేషకుల అంచనా.















Click it and Unblock the Notifications
