చంద్రబాబు ఇల్లు అటాచ్ మెంట్- ఎల్లుండి ఏసీబీ కోర్టు తీర్పు ..
ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి కరకట్టపై నివసిస్తున్న లింగమనేని రమేష్ కు చెందిన ఇల్లు అటాచ్ మెంట్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఇంటిని అటాచ్ చేసుకునేందుకు సీఐడీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. అనంతరం తీర్పు రిజర్వ్ అయింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో క్విడ్ ప్రోకు పాల్పడిన నేపథ్యంలో చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ ఇంటిని అటాచ్ చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఈ నేపథ్యంలోనే సీఐడీకి ఈ మేరకు అటాచ్ చేసుకునేందుకు అనుమతిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీని ఆధారంగా సీఐడీ తదుపరి చర్యలకు సిద్ధమైంది. సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఇల్లు అటాచ్ మెంట్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి లింగమనేని రమేష్ కు అమరావతిలో భూములిచ్చి లబ్ది చేకూర్చాలని సీఐడీ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగానే చంద్రబాబుకు కరకట్టపై ఉన్న ఇంటిని లింగమనేని రమేష్ ఇచ్చారని అభియోగాలు మోపింది. దీనిపై ఇవాళ సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు ఇంటితో పాటు మాజీ మంత్రి నారాయణ బంధువు ఇంటి అటాచ్ మెంట్ కోసం సీఐడీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది.
అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబు ఇల్లు అటాచ్ చేసేందుకు ప్రయత్నించడంపై న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. కానీ సీఐడీ మాత్రం నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఎల్లుండికి అంటే జూన్ 2కు తీర్పును వాయిదా వేసింది. దీంతో ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పు ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications