We want Justice: రాత్రంతా గుంటూరు నాగార్జున వర్శిటీ విద్యార్థినుల మెరుపు ఆందోళన..!!
ప్రఖ్యాతి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థినులు రోడ్డెక్కారు. హఠాత్తుగా ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాత్రంతా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ర్యాలీ సైతం చేపట్టారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. వారి నినాదాలు, నిరసనలతో క్యాంపస్ అట్టుడికిపోయింది.
దీనికి కారణం- అత్యంత నాసిరక భోజనం పెడుతోండటమే. క్యాంపస్‌లో వసతి గృహాలు, మెస్‌లో నాసిరకం ఆహారాన్ని పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆగ్రహోదగ్రులయ్యారు. దీనిపై వారం రోజుల నుంచీ ఫిర్యాదు చేస్తోన్నప్పటికీ పట్టించుకోకపోవడాన్ని సహించలేకపోయారు. ఆందోళనలకు దిగారు. రాత్రంతా నిరసన ప్రదర్శనలను కొనసాగించారంటే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉంటోందంటూ వారం రోజులుగా ఫిర్యాదులు చేస్తూ వస్తోన్నామని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం కిందట భోజనంలో కాళ్లజెర్రి వచ్చిందని చెప్పారు. నాలుగు రోజుల కిందట మరోసారి అలాంటి సంఘటనే సంభవించిందని, భోజనంలో కప్ప వచ్చిందని అన్నారు.
గురు, శుక్రవారాల్లో వరుసగా అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థినులు మండిపడ్డారు. భోజనం ఇంత నాసిరకంగా ఉంటే ఎలా తినగలుగుతామని విద్యార్థినులు ప్రశ్నిస్తోన్నారు. వారం రోజుల నుంచి తాము సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్‌కు ఈ విషయాన్ని తెలియజేశామని, అయినా భోజనం నాణ్యత మెరుగుపడలేదని అన్నారు.
ఎవరూ పట్టించుకోకపోవడంతో వందలాది మంది విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ర్యాలీగా బయలుదేరారు. తొలుత మహిళల హాస్టల్ వద్ద బైఠాయించారు. అనంతరం ర్యాలీగా వైస్ ఛానల్సర్ ఛాంబర్ వద్ద ధర్నాకు దిగారు. అర్ధరాత్రి వరకూ వారి ఆందోళన కొనసాగింది.












Click it and Unblock the Notifications