ఒకవైపే చూడొద్దు: ఎడమ చేతికీ అవకాశం ఇవ్వండి..!!
అమరావతి: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కోన రఘుపతి రాజీనామా చేయడం వల్ల ఖళీ అయిన స్థానాన్ని కోలగట్ల భర్తీ చేశారు. ఈ పదవి కోసం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఇతర సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సభను నిష్పక్షపాతంగా నడిపించాలని విజ్ఞప్తి చేశారు. సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న వారు ఎలాంటి రాగధ్వేషాలకు గురి కాకుండా మాట్లాడటానికి అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎక్కువగా అధికార పార్టీ సభ్యులకే సభలో మాట్లాడటానికి ఎక్కువ అవకాశాలను కల్పిస్తుంటారని, కుడిచేతి వైపే చూస్తుంటారని అన్నారు.
కనీసం డిప్యూటీ స్పీకర్ అయినా తమకు కేటాయించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సమయం ఎడమచేతి వైపు చూసి, తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అధికార పార్టీ వైఫల్యాలు గానీ, తప్పులు గానీ.. ఈ శాసనసభలో లేవనెత్తుతామని, వాటిని సరిదిద్దుకునేలా చేస్తామని అన్నారు. వైఫల్యాలు, తప్పులను సరిచేసుకోవడం వల్ల అది అధికార పార్టీకే మేలు జరుగుతుందని అచ్చెన్నాయుడు చెప్పారు.

సభ్యుడిగా ఉన్న అపారమైన అనుభవం- ఈ శాసనసభ సజావుగా నడవడానికి, ప్రజల సమస్యలపై ఎక్కువ కాలం పాటు చర్చించడానికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమకు ఎన్నో సమస్యలుు ఉన్నప్పటికీ- డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్లను ఎన్నుకోవడానికి సహకరించామని పేర్కొన్నారు. కోలగట్లను అభినందిస్తూ పుష్పా శ్రీవాణి మాట్లాడారు. ఈ గౌరవం ప్రత్యేకమైనదని, విజయనగరం జిల్లాకు చెందిన వారెవరూ రాజ్యాంగబద్ధమైన స్థానంలో కూర్చోలేదని అన్నారు.
ఇప్పటివరకు స్పీకర్‌గా గానీ, డిప్యూటీ స్పీకర్‌గా గానీ విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులెవరూ నియమితులు కాలేదని అన్నారు. వ్యక్తిగతంగా కోలగట్ల తనకు తండ్రి సమానులని, రాజకీయాల్లో తనను మొదటి నుంచీ ప్రోత్సహించారని చెప్పారు. అలాంటి తమ జిల్లా నాయకుడికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications