అమూల్ పై చేతులెత్తేసిన జగన్ సర్కార్ ?- పాల సేకరణలో విఫలం-రైతులు, అధికారులపై ఒత్తిళ్లు
ఏపీలో సహకార పాల ఉత్పత్తి రంగంలో అద్బుతాలు చేస్తుందని తీసుకొచ్చిన గుజరాతీ అమూల్ డెయిరీ త్వరలో చేతులెత్తేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే పాలు పోస్తున్న సహకార డెయిరీల్ని కాదని అమూల్ కు పాలు సరఫరా చేసేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో అమూల్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వైసీపీ సర్కార్ తగినన్ని పాలు సరఫరా చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఎలాగైనా సరే రైతుల నుంచి పాలు సేకరించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్లు పెడుతోంది.

అమూల్ తో జగన్ సర్కార్ ఒప్పందం
గుజరాత్ కు చెందిన సహకార పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ డెయిరీతో జగన్ సర్కార్ ఏడాది క్రితం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఏపీలోని అన్నిజిల్లాల్లో రైతుల నుంచి అమూల్ కు పాలు సేకరించి ఇస్తే అమూల్ వాటితో పాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మి పెడుతోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం వద్ద లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని అమూల్ ఉపయోగించాల్సి ఉంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అమూల్ కు తగినన్ని ఆర్ధిక వనరుల్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా జరగాలంటే ముందు రైతులు అమూల్ కు పాలు పోయాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో డెయిరీలతో రైతుల అనుబంధం
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఆయా జిల్లాల్లోని రైతులకు సుదీర్ఘ అనుబంధం ఉంది. రైతులు తమకు పాలు పోస్తున్నందుకు కేవలం పాల డబ్బులే కాకుండా వాటితో తయారు చేసే ఉత్పత్తుల్ని అమ్మి వచ్చే లాభాల్లోనూ డెయిరీలు రైతులకు వాటా ఇస్తున్నాయి. ఏటా డివిడెండ్లు కూడా ఇస్తుంటాయి. దాదాపుగా చెప్పాలంటే ఆయా డెయిరీలను రైతులు తమ సొంత సంస్ధలుగా పరిగణిస్తుంటారు. సుదీర్ఘకాలంగా లక్షలాది రైతు కుటుంబాలకు ఈ డెయిరీలు అండగా ఉంటున్నాయి. దీంతో వీరి అనుబంధం దృఢంగా ఉంది.

అమూల్ రాకతో మారిన సీన్
రాష్ట్రంలో సహకార పాల డెయిరీలతో రైతుల అనుబంధం కొనసాగుతున్న నేపథ్యంలో వారి కుటుంబాలకు సైతం అన్ని విధాలుగా సదరు డెయిరీలు అండదండలు అందిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్ కు చెందిన అమూల్ డెయిరీని వైసీపీ సర్కార్ రంగంలోకి దింపింది. గుజరాత్ పాల ఉత్పత్తి రంగంలో విజయవంతమైన సంస్ధగా పేరు తెచ్చుకున్న అమూల్ ఎంట్రీతో రాష్ట్రంలో సహకార రంగం కొత్త పుంతలు తొక్కుతుందని వైసీపీ సర్కార్ ప్రకటించింది. అమూల్ కు మీరు పాలిస్తే చాలు మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుందంటూ సీఎం జగన్ స్వయంగా అక్కచెల్లెళ్లకు నమ్మబలికారు. దీంతో రైతులు అమూల్ వైపు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావించింది. కానీ అలా జరగలేదు.

అమూల్ వైపు మొగ్గని రైతులు
తాము అప్పటివరకూ రాష్ట్రంలో పాలు సరఫరా చేస్తున్న డెయిరీల్ని కాదని అకస్మాత్తుగా ప్రభుత్వం చెప్పిందని అమూల్ వైపు మొగ్గు చూపేందుకు రైతులు సిద్దపడలేదు. ప్రభుత్వం చెప్పింది విని తాము దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్న డెయిరీలకు చేయిచ్చేందుకు రైతులు నిరాకరించారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాలసేకరణలో ఇబ్బందులు మొదలయ్యాయి. అమూల్ అయితే వచ్చింది కానీ దానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విధంగా పాల సేకరణ చేసి ఇవ్వలేకపోతోంది. రైతుల నుంచి సహకారం లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
ప్రభుత్వం ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా అమూల్ కు పాలు పోసేందుకు పలు జిల్లాల్లో సహకార రైతులు మొగ్గు చూపడం లేదు. దీంతో ప్రభుత్వం వారిని ఒప్పంచి పాలు పోయించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ కార్యదర్శులు రైతుల్ని బతిమలాడటం మొదలుపెట్టారు. కుదరపోయే సరికి బెదిరింపులకు దిగారు. అయినా కుదరకపోవడంతో లాబీయింగ్ మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో చేతులెత్తేస్తున్నారు. రైతులు అమూల్ కు పాలు పోసేందుకు ఇష్టపడటం లేదని ఉన్నతాధికారులకే నేరుగా చెప్పేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ఉన్నతాధికారులు తాజాగా గుంటూరు జిల్లాలో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. అమూల్ కు పాలు ఇప్పించడంో విఫలమయ్యారంటూ తమకు నోటీసులు ఇవ్వడమేంటని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
Recommended Video

అమూల్ ప్రాజెక్టు కొనసాగేనా ?
రాష్ట్రంలో ఇదే పరిస్ధితి కొనసాగితే అమూల్ కు పాల సేకరణ కష్టంగా మారబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే సహకార రంగంలో పలు డెయిరీలు స్ధిరపడి ఉండటం, వాటినే నమ్ముకుని ఇన్నాళ్లూ పాలు సరఫరా చేస్తున్న రైతులు వెంటనే వాటిని వదులుకుని బయటికి రాలేకపోవడం, ఐదేళ్లకోసారి మారే ప్రభుత్వాలతో పోలిస్తే స్ధిరంగా పనిచేసే సహకార డెయిరీలతోనే అనుబంధం కొనసాగించేందుకు రైతులు సిద్ధపడటం, మరోవైపు కేంద్రం నుంచి అమూల్ కు నిధులు ఇప్పించి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా నత్తనడకన సాగుతుండటం... ఇలా ఎటు చూసినా అమూల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో అమూల్ కు కూడా వాస్తవం తెలిసొచ్చింది. ఈ దశలో ఏపీలో అమూల్ ప్రాజెక్టు కొనసాగింపుపై సంస్ధ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలలు ఇదే పరిస్ధితి కొనసాగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగని వెంటనే వైసీపీ సర్కార్ కు గుడ్ చై చెప్పి వెళ్లిపోయే పరిస్ధితీ లేదు. దీంతో మరికొంతకాలం ఈ డైలమా కొనసాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications