అనంత పోలీసులకు బాబు ఫుల్ పవర్స్..! నిందితుడి పథకాలు కట్, ఆస్తుల సీజ్..!
అనంతపురంలో వరుసగా మహిళలపై చోటు చేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లు కనిపిస్తోంది. ఓవైపు అమరావతి మహిళల్ని వేశ్యలుగా అభివర్ణిస్తూ సాక్షి టీవీలో జరిగిన డిబేట్ పై దూకుడుగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి రాయలసీమలో చోటు చేసుకున్న ఈ ఘటనలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో సీఎం చంద్రబాబు వీటిపై తక్షణ చర్యలు తీసుకునేలా పోలీసులతో పాటు ఇతర అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు.
అనంతలో రెండు ఘటనలపై సీరియస్ గా ఉన్న సీఎం చంద్రబాబు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలి ఆడ బిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితి రావాలని వారికి సూచించారు.యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో విచారణ వేగంగా పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు. దీంతో పోలీసులు, ఇతర అధికారులు రంగంలోకి దిగారు.

ఈ రెండు ఘటనల్లో ఒకటైన ఇంటర్ విద్యార్దిని తన్మయి హత్య కేసును ఛేదించినట్లు ఎస్పీ ఇవాళ తెలిపారు. నిందితుడు నరేష్‌ను అరెస్ట్ చేశామన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో తలకు దెబ్బతగలడం వల్లే మృతిచెందిదని తేలిందన్నారు. నరేష్‌తో తన్మయికి 3 నెలల నుంచి పరిచయం ఉందని, పెళ్లి చేసుకుందామని తీసుకెళ్లి కొట్టి చంపేశాడని తెలిపారు. నెల రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నందునే నరేష్ ఈ హత్య చేసినట్లు తెలిపారు.

అలాగే ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ ను ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందన్నారు. ఈ కేసులో నిందితునికి సంబంధించిన ఆస్తులన్నీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో నిందితులపై ఇకపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications