పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు యాక్షన్- ఆ పోలీసుల లిస్ట్ రెడీ ? కడపతో సంకేతం..
ఏపీలో మహిళలపై వరుస అత్యాచారాలు, సోషల్ మీడియాలో తమ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం చంద్రబాబును సూటిగా తాకుతున్నాయి. మొన్న పిఠాపురంలో, నిన్న కేబినెట్ భేటీలోనే పోలీసుల తీరుపై పవన్ సూటి విమర్శలు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నారు. పవన్ వ్యాఖ్యలపై కేబినెట్లోనే స్పందించి చర్యలకు హామీ ఇచ్చిన చంద్రబాబు పని మొదలుపెట్టేశారు.
తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డిని కడప పోలీసులు ఓ కేసులో అదుపులోకి తీసుకుని కేవలం 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయడంపై సీరియస్ అయిన చంద్రబాబు.. వెంటనే రిపోర్ట్ తెప్పించుకుని కడప ఎస్పీ హర్ష వర్ధన్ రాజుపై వేటు వేశారు. అంతే కాదు మరో సీఐపైనా సస్పెన్షన్ వేటు పడింది. దీంతో సరిపెట్టకుండా నిన్న రాత్రికి బోరుగడ్డతో బిర్యానీ పార్టీ చేసుకున్న ఏడుగురు గుంటూరు పోలీసులను సస్పెండ్ చేశారు.

దీనికి కొనసాగింపుగా.. మరో ముగ్గురు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలపై త్వరలో బదిలీ లేదా సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు అధికారుల జాబితా డీజీపీ ఆఫీసుకు చేరిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు వందల సంఖ్యలో నోటీసులు జారీ చేయడం, అరెస్టులు చేయడం జరుగుతోంది. దీన్ని త్వరలో మరింత ఉధృతం చేయబోతున్నారు. ఈ విషయంలో యాక్షన్ తీసుకోని పోలీసులపై తక్షణ చర్యలు తీసుకోబోతున్నారు.












Click it and Unblock the Notifications