Janasena: ఇక ఏపీపై పవన్ ఫోకస్-ఎల్లుండి జనసేన రాష్ట్రస్ధాయి భేటీ...
ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత తమ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బిజీగా ఉన్న జనసేనకు తెలంగాణ ఎన్నికల రూపంలో బ్రేక్ పడింది. అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రచారం,వ్యూహాల్లో బిజీగా ఉండటంతో టీడీపీతో సమన్వయ భేటీల తర్వాత ఏపీలో జనసేన కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ఇప్పుడు రేపటితో తెలంగాణ ఎన్నికల పోలింగ్ కూడా ముగియనుండటంతో డిసెంబర్ 1 నుంచి ఏపీపై పూర్తి స్ధాయి ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఏపీ ఎన్నికలకు జనసేన శ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు, అలాగే టీడీపీతో క్షేత్రస్ధాయిలో సమన్వయం మరింత పెంచేందుకు వీలుగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు జనసేన విస్తృత స్ధాయి భేటీ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎల్లుండి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్.. పార్టీ నేతలతో జనసేన విస్తృత స్ధాయి భేటీ నిర్వహిస్తారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించే అవకాశముంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1వ తేదీన మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3గం.కు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమవుతుందని జనసేన వర్గాలు తెలిపాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు ఇతర కీలక నేతలు ఇందులో పాల్గొంటారు.
జనసేన విస్జృత స్ధాయి భేటీలో పార్టీ పిఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు విస్తృత స్థాయి సమావేశంల్లో పాల్గొంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై పవన్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. జనసేన -టీడీపీ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై చర్చిస్తారు.












Click it and Unblock the Notifications