ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు: 1,000 గ్రాముల బంగారం దానికి వినియోగం: టీటీడీ బోర్డు నిర్ణయాలు
టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీమ్‌లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అవన్నీ కూడా ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, యూనిఫార్మిటీ తీసుకురావడానికి ఈ పలు మార్పులు చేపట్టింది. ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయి
ఈ విషయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ మధ్యాహ్నం టీటీడీ బోర్డు సమావేశమైంది. పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, ఏఈఓ వెంకయ్య చౌదరితో కలిసి బీఆర్ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రూ.6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండటానికి ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించడానికి ఉద్దేశించిన టెండర్లను టీటీడీ పాలక మండలి ఆమోదించింది. కుమారధార, పసుపుధార డ్యామ్‌లు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని తీర్మానించింది.
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీన్ని విరాళంగా నెలకొల్పనుంది. టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50 గా ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు.
మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించాలని పాలకమండలి తీర్మానించింది. దీనికోసం ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతుంది టీటీడీ. తిరుమల కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైనున్న పాత ఘన వ్యర్థాలను బయో రిమీడియేషన్, బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి అయిదు కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లు కేటాయించడంతో పాటు టీబీసీ, ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత కట్టడాలను తొలగించి, వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం. తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పన, ఎఫ్ఎంఎస్ సేవలకు రూ.2.91 కోట్లు మంజూరు.
ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూల విరాట్టులకు బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీ నుంచి 1,000 గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.17.84 కోట్లతో ఒంటిమిట్టలో 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండర్లను ఆమోదించింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై సాలహారం నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్లతో టెండర్ కు ఆమోదించింది.














Click it and Unblock the Notifications