విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడటం స్థానికంగా కలకలం సృష్టించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపైకి దూసుకొచ్చాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పనుల నిమిత్తం ఘాట్ రోడ్డును మూడు రోజుల ముందే మూసివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సమాచారం అందిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఈ ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈఓ సీనా నాయక్, ఇతర దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన కొండచరియలు విరిగిపడిన మార్గాన్ని పరిశీలించారు. బండరాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. జేసీబీలు, ఆధునిక క్రేన్లను రంగంలోకి దించారు. వీలైనంత త్వరగా మార్గాన్ని భక్తులకు సిద్ధం చేయాలని సూచించారు.

కొండ వాలుల్లో ప్రమాదకరంగా ఉండి, ఎప్పుడైనా జారిపడే వీలున్న రాళ్లను ముందే గుర్తించి, వాటిని సురక్షితమైన పద్ధతిలో తొలగించే ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు వెంట బలహీనపడిన రిటైనింగ్ వాల్స్, ఫెన్సింగ్, కొండరాళ్లు పడకుండా పటిష్టపరిచే రాక్ఫాల్ ప్రొటెక్షన్ నెట్స్ పునరుద్ధరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ఘాట్ రోడ్డులోకి ఎవరినీ అనుమతించకూడదని చెప్పారు.
దేవస్థానం ఈఓ సీనా నాయక్ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆలయ యంత్రాంగం ముందు నుంచే అప్రమత్తంగా ఉందని తెలిపారు. గురువారం రాత్రే తాము స్వయంగా ఘాట్ ఘాట్ రోడ్డును తనిఖీ చేసి, ఇంజినీరింగ్ విభాగాలను అప్రమత్తం చేయడం వల్ల సకాలంలో స్పందించగలిగామని చెప్పారు. రానున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఇప్పుడే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను సైతం సిద్ధం చేస్తున్నారు.
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ తరుణంలో ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడటం అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఉత్సవాల ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం నివారించగలిగినప్పటికీ, పండుగ రోజుల్లో కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటం ఇప్పుడు జిల్లా యంత్రాంగానికి, దేవాదాయ శాఖకు సవాలుగా మారింది.












Click it and Unblock the Notifications
