అమరావతిలో అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు- మళ్లీ ఇన్ సైడర్ ప్రయోగం- రైతుల మద్దతు కరవు ?
అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిరూపించడంలో విఫలమైంది. సీఐడీ, ఏసీబీ వంటి దర్యాుప్తు సంస్ధల్ని ప్రయోగించినా కచ్చితమైన ఆధారాలు సంపాదించడంలో ఫెయిలైంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యనహారంలో దర్యాప్తుపై తాజాగా హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రయోగం కూడా విఫలమైంది. దీంతో చివరిగా అసైన్డ్ భూములకే అమరావతి స్కాం పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

జగన్ కు అంతు బట్టని అమరావతి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తెరపైకి వచ్చిన అమరావతి రాజధానిపై వైసీపీ కొన్నేళ్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాజధాని ఏర్పాటు సందర్భఁగా అక్కడ చోటు చేసుకున్న అక్రమాల్ని వెలికి తీసేందుకు విపక్షంలో మొదలుపెట్టిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో అమరావతి భూముల్ని టీడీపీ నేతలు కారుచౌకగా కొట్టేశారని వైసీపీ చేసిన ఆరోపణలు కోర్టుల్లో కూడా నిరూపణ కాలేదు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇక్కడ వాడకూడదంటూ హైకోర్టు తేల్చేయడంతో వైసీపీకి ఏం చేయాలో తెలియని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం అసైన్డ్ భూముల రూపంలో మరో స్కాంను బయటపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇన్ సైడర్ ప్రయోగం విఫలం
అమరావతిలో భూములు కొట్టేందుకు టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ను అస్త్రంగా వాడుకున్నారని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు అప్పటీ సీఎం చంద్రబాబు సాయంతో రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా తెలుసుకుని అక్కడ భారీ ఎత్తున భూముల్ని సొంతం చేసుకున్నారనేది వైసీపీ ఆరోపణ. అయితే ఈ ఆరోపణను నిరూపించడానికి తగిన ఆధారాలు సంపాదించడంలో వైసీపీ విఫలమైంది. కేవలం రాజధాని రాకముందే ఆ ప్రాంతంలో భూములు కొన్నారన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడంలో అవి కాస్తా చట్టం ముందు నిలబడకుండా పోయాయి. దీంతో ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వైసీపీ సర్కార్ సవాల్ చేసింది.

అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు పస లేనివని తేలిపోవడంతో ఇప్పుడు అసైన్డ్ భూముల కొనుగోళ్ల రూపంలో మరో స్కాంను వైసీపీ తెరపైకి తెస్తోంది. అమరావతిలో రైతులకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కొందరు రియల్టర్ల సాయంతో భయపెట్టి కొనుగోలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తున్నారు. అప్పట్లో రియల్టర్ బ్రహ్మానందరెడ్డి భూముల కొనుగోలు కోసం రైతుల్ని ప్రలోభపెట్టిన వ్యవహారంపై వీడియోలు బయటపెట్టిన ఆయన... అసైన్డ్ భుూముల స్కాంను తెరపైకి తెచ్చారు. గతంలో ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని లాక్కోవడానికి జీవో నంబర్ 41 ఇచ్చారంటూ అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా ఆరోపణలు చేశారు. వీటిపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. అయినా దీనిపై ఇప్పటికీ ఏమీ తేలలేదు. దీంతో అసైన్డ్ భూముల కొనుగోళ్ల ఆధారంగా టీడీపీని టార్గెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Recommended Video

అసైన్డ్ భూముల స్కాంలోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్
వైసీపీ ఎమ్మెల్యే తాజాగా తెరపైకి తెచ్చిన అసైన్డ్ భూముల విక్రయాల వ్యవుహారంలోనూ పరోక్షంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను తెరపైకి తెచ్చారు. ఎస్సీ రైతుల నుంచి అసైన్డ్ భూములను ప్రభుత్వం రాజధాని భూసమీకరణ చేపట్టకముందే టీడీపీ నేతలు కొనుగోలు చేశారని, ఇందుకు రియల్టర్లను సిండికేట్ గా మార్చి వారిపై ప్రయోగించారని ఆర్కే చెబుతున్నారు. తద్వారా అసైన్డ్ భూముల స్కాంలోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం కూడా కోర్టుల ముందు నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రంగా అప్పట్లో తమ భూముల్ని టీడీపీ నేతలకు అమ్ముకున్న రైతులెవరూ వైసీపీ ప్రభుత్వ ఆరోపణణలకు మద్దతుగా ముందుకు రాకపోవడం కూడా ఈ అనుమానాల్ని పెంచుతోంది.












Click it and Unblock the Notifications