సీఎం విజయ్ బాటలో వైఎస్ జగన్: క్యాడర్ కు వెన్నుదన్నుగా- గేమ్ ఛేంజర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీ శ్రేణులతో నేరుగా అనుసంధానం కావడానికి జగన్ 2.0 సూపర్ యాప్ (Jagan 2.0 Super App) పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నూతన ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, ప్రతి ఒక్క కార్యకర్త కూడా అగ్రనాయకత్వంతో అనుసంధానం కావాలనేది దీని ముఖ్య ఉద్దేశం.
సాధారణంగా ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ అధినేతను నేరుగా కలవడం లేదా స్థానిక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం క్షేత్రస్థాయి కార్యకర్తలకు అత్యంత కష్టతరం. అందులోనూ వైఎస్ఆర్సీపీ వంటి కోట్లాదిమంది అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, క్యాడర్ ఉన్న పార్టీలో ఇటువంటివి మరింత క్లిష్టం. ఇప్పటికే జగన్ ను కలవడం అనేది అసాధ్యమైందనే అభిప్రాయం మెజారిటీ కార్యకర్తల్లో వ్యక్తమౌతోంది కూడా.

మధ్యలో ఉండే నాయకులు కొన్నిసార్లు సమాచారాన్ని సరిగ్గా చేరవేయకపోవట్లేదనే వాదనలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అంతరాన్ని పూర్తిగా తొలగించడానికి వైఎస్ జగన్ నేరుగా ఈ అప్లికేషన్‌కు తెరతీశారు. జగన్ 2.ఓ సూపర్ యాప్ ను రూపొందించింది. దీని ద్వారా గ్రామ, వార్డు స్థాయిల్లో పనిచేసే ప్రతి ఒక్క సాధారణ కార్యకర్తకు కూడా నేరుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంతో కనెక్టివిటీ ఏర్పడుతుందనేది ఆయన అభిప్రాయం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ ప్రారంభించిన మై టీవీకే (My TVK) యాప్ ఆ పార్టీ విజయంలో ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. బూత్ స్థాయి నిర్వహణ, సభ్యత్వ నమోదు త్వరితగతిన పూర్తి చేయడం, పార్టీ కార్యకర్తల సమీకరణలో ఆ యాప్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. 2025 జులై 30న విజయ్ స్వయంగా ఈ యాప్ ను లాంచ్ చేశారు. కొత్తగా ఏర్పాటైన పార్టీ కావడం వల్ల దీన్ని గ్రామం, ప్రతి బ్లాక్, ప్రతి బూత్ కూ చేరవేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడిందనడానికి టీవీకే సాధించిన విజయమే నిదర్శనం.
విజయ్ ఎన్నికల ప్రసంగాలన్నీ కూడా ఈ యాప్ లో ద్వారా టెలికాస్ట్ అయ్యాయి. టీవీకే ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి విజయ్ అభిమాని కూడా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసిపెట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. తాను చెప్పదలచుకున్న ప్రతి విషయాన్నీ నేరుగా అటు పార్టీ క్యాడర్, ఇటు సామాన్య ప్రజలకు చేరవేయగలిగారు విజయ్. ఫలితంగా పార్టీ అగ్రనాయకత్వం, కిందిస్థాయి క్యాడర్ మధ్య ఎటువంటి గందరగోళానికీ అవకాశం రాలేదు.
తాజాగా వైఎస్ జగన్ కూడా ఇదే పంథాను అనుసరించారు. ఓ అడుగు ముందుకే వేశారు. జగన్ 2.0 సూపర్ యాప్ అంతకంటే మెరుగ్గా పని చేస్తుందని చెబుతోంది వైఎస్ఆర్సీపీ. ఇది సమాచార మార్పిడికి మాత్రమే కాకుండా, బూత్ స్థాయి పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు.
పరాజయం తర్వాత వైఎస్సార్‌సీపీ తన పునాదులను పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాయకులు పార్టీని వీడి వెళ్లినా, క్షేత్రస్థాయిలో నిలబడే సాధారణ కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications