నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పక్కా ప్లానింగ్
కలియుగవైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇటీవలే ముగిశాయి. మొత్తం 5.76 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 28.94 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో మొత్తం 21.84 లక్షల అన్నప్రసాదాలను స్వీకరించారు. 2.04 లక్షల మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే.. 33 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.
ఇప్పుడిక శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కాబోతోన్నాయి. వీటి తేదీలను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం) లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివిధ విభాగాల ఏర్పాట్లపై అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలను పటిష్టమైన ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించామని, అదే స్ట్రాటజీని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ అనుసరించాలని ముద్దాడ రవిచంద్ర సూచించారు. టీటీడీలోని అన్ని విభాగాలు, పోలీసు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయాన్ని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించాలని అన్నారు. వసతి గదుల కేటాయింపు, క్యూలైన్లు, అన్న ప్రసాదాల వితరణ, రవాణాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు.
వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో సాలకట్లతో పోల్చితే ఈసారి బ్రహ్మోత్సవాలకు సుమారు 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలెత్తిన లోటుపాట్లను పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ లాజిస్టిక్స్, అన్నప్రసాదం, వైద్య ఆరోగ్యం, పారిశుధ్యం, రవాణా తదితర అన్ని విభాగాల్లో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక చింతనతో శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను వీక్షించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని రవిచంద్ర సూచించారు.













Click it and Unblock the Notifications
