రేవంత్ రెడ్డి అరెస్టు: బాసెవరో దర్యాప్తు తర్వాత తేలుతుందన్న ఖాన్
హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిది కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసు అని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డిజి ఎకె ఖాన్ చెప్పారు. రేవంత్ రెడ్డి తమ బాస్‌గా చెప్పిన వ్యక్తి ఎవరో దర్యాప్తు తర్వాత తేలుతుందని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయంపై ఎకె ఖాన్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రాథమిక సాక్ష్యాధారాల మేరకే రేవంత్ రెడ్డిని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని, వారిని విచారిస్తున్నామని, విచారించిన తర్వాత అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ప్రాథమిక ఆధారాలతోనే కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. డబ్బులు ఇవ్వడానికి వచ్చిన రేవంత్ రెడ్డితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు. డీల్ కుదర్చడానికి సహాయపడిన మరో వ్యక్తి ఉన్నారని, దర్యాప్తు క్రమంలో ఆధారాలు లభిస్తే అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

తాము ఏ విధమైన వీడియో సీడీలను మీడియాకు విడుదల చేయలేదని ఆయన చెప్పారు. యాభై లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీల్ ఎంతకు చేసుకున్నారనేది ఇంకా తేలాల్సి ఉందని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిని, మరో ఇద్దరిని విచారిస్తున్నామని, విచారణ తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు.
స్టీఫెన్ సన్ రెండు రోజుల క్రితం తమకు ఫిర్యాదు చేశారని, తమను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని స్టీఫెన్ సన్ ఫిర్యాదు చేశారని, దాంతో తాము దర్యాప్తు చేపట్టామని, దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. ఎన్నికలు ఉన్నందున అరెస్టు విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని ఆయన చెప్పారు. పక్కా సమాచారంతోనే తాము ట్రాప్ చేశామని ఎకె ఖాన్ చెప్పారు.












Click it and Unblock the Notifications