గుడివాడలో నాగార్జున సందడి..! ఏఎన్నార్ కాలేజ్ కు డైమండ్ జూబ్లీ గిఫ్ట్..!
నాన్న ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన సంస్థలు తనకు ఎప్పుడు ప్రత్యేకమేనవే అని తెలిపారు. పట్టణంలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునను చూసేందుకు భారీగా ఆయన అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున కాలేజీలో విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం రూ.2కోట్ల రూపాయలను ప్రకటించారు.
గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ రెండో రోజు వేడుకల్లో సినీ హీరో అక్కినేని నాగార్జున, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. నాగార్జున సభా వేదిక మీదకు చేరుకోగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.

అనంతరం అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద... కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ కోసం తమ కుటుంబం తరఫున రూ.2కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందనీ నాగార్జున పేర్కొన్నారు. మనుషులు శాశ్వతం కాదనీ వారు చేసే పనులే శాశ్వతమని, తాను చదువుకోలేక పోయినా...వేలాదిమంది చదువు,వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారనీ ,రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు.

సినిమాకు రూ.5వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో లక్ష రూపాయలు కళాశాలకు విరాళంగా ఇచ్చారనీ, ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ,విదేశాల్లో, ఎంతో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషకరమన్నారు. తన తరపున తన కుటుంబ సభ్యుల తరఫున ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్ షిప్పుల్ని అందిస్తామన్నారు. కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అభివృద్ధికి రేపు వేడుకల్లో పాల్గొనే మంత్రి లోకేష్ సహకరించేలా ఎమ్మెల్యే రాము కృషి చేయాలని నాగార్జున కోరారు. గుడివాడలో తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. నన్ను కింగ్, మన్మధుడు, మాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారని, నేను అక్కినేని నాగేశ్వరావు గారి అబ్బాయి నాగార్జున అంటేనే ఇష్టమన్నారు.












Click it and Unblock the Notifications