రోడ్డు ప్రమాదంలో ఆకుల భూమయ్య దుర్మరణం
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఉద్యమ నేత ఆకుల భూమయ్య (63) మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన 'ప్రజాస్వామ్య తెలంగాణ' పుస్తకావిష్కరణ సభలో పాల్గొని అడిక్‌మెట్‌లోని తన నివాసానికి 'చేతక్' వాహనంపై తిరిగి బయలుదేరారు. రాత్రి పది గంటల సమయంలో ఆయన వాహనాన్ని జీహెచ్ఎంసీకి చెందిన టిప్పర్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ప్రజా ఫ్రంట్ నాయకులు వేదకుమార్, విరసం నేత వరవర రావు, టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అరుణోదయ విమల, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 'ఆకుల భూమయ్యది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదు. ముమ్మాటికీ హత్యే' అని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. భూమయ్య మృతదేహంతో సంఘటన స్థలం వద్దే ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చేవరకూ భౌతిక కాయాన్ని తరలించబోమని వేదకుమార్ స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన తర్వాత గంట వరకు కూడా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతదేహాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆకుల భూమయ్యది తెలంగాణ పురిటిగడ్డ కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం కాజాపూర్ గ్రామం. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లోనూ తర్వాత డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లోనూ పని చేశారు.
1996లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ జనసభకు ఆయన కన్వీనర్‌గా వ్యవహరించారు. ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. 2010లో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌లో గద్దర్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ప్రజా కవి గద్దర్ స్థానంలో అధ్యక్ష బాధ్యతలను భూమయ్య చేపట్టారు. భూమయ్యకు భార్య అరుణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.












Click it and Unblock the Notifications