అఖిల పక్ష భేటీ: జగన్, చంద్రబాబు ఏం చెప్తారు?

హైదరాబాద్: ఆనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి రాష్ట్రానికి చెందిన పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెసు అధిష్టానం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల పక్ష సమావేశం కూడా నవంబర్ 7వ తేదీలోపలే ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సుశీల్ కుమార్ షిండే కలిసిన తర్వాత, కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. పైగా, నవంబర్ 5వ తేదీలోగా కేంద్ర మంత్రుల గ్రూపు ముందు వాదనలు వినిపించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలను కోరింది. గుర్తింపు పొందిన 8 పార్టీలకు ఈ మేరకు ఆహ్వానాలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అఖిల పక్ష సమావేశంలో జగన్, చంద్రబాబు ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది.

Ys Jagan and Babu

అఖిల పక్ష సమావేశానికి మునుపటి మాదిరిగా పార్టీకి ఇద్దరేసి నాయకులను ఆహ్వానిస్తారా, ఒక్కరినే ఆహ్వానిస్తారా అనేది కూడా తెలియడం లేదు. విభజనపై పునరాలోచనకు కాకుండా ఇరు ప్రాంతాలకు ఎలా న్యాయం చేయాలనే విషయంపైనే అఖిల పక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. అందువల్ల అఖిల పక్ష సమావేశానికి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించే అవకాశం లేకపోలేదు.

కాగా, వైయస్ జగన్ వినిపిస్తున్న సమైక్యవాదంలో పెద్ద లొసుగే ఉంది. తండ్రిలాగా ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మాత్రమే జగన్ కోరుతున్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేస్తే విభజనకు అభ్యంతరం లేదనే సంకేతం ఆయన మాటల నుంచి వ్యక్తమవుతోంది. అందువల్ల సమన్యాయం ఏ విధంగా చేయాలనే విషయంపై అఖిల పక్ష సమావేశం చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన సూచనలు చేయాలని అడిగే అవకాశం ఉంది.

అదే విధంగా చంద్రబాబు కూడా సమన్యాయం గురించే మాట్లాడుతున్నారు. సమన్యాయమంటే ఏమిటో, ఏ విధంగా దాన్ని చేయాలో నిర్దిష్టంగా చెప్పడంలో ఆయన కూడా విఫలమయ్యారు. హైదరాబాద్, నిధులు, జలాల పంపిణీ, విద్యఉద్యోగావకాశాల గురించి సమన్యాయం చేయాలని ఆయన అంటున్నారు. అది ఎలా చేయాలో చంద్రబాబు నుంచి లేదా తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం అడిగే అవకాశం లేకపోలేదు.

జగన్, చంద్రబాబు వాదనలు చూస్తుంటే విభజనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే సమన్యాయం గురించి మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. తద్వారా విభజన ప్రక్రియను ఆపాలనే వ్యూహం తప్ప మరోటి కనిపించడం లేదని అంటున్నారు. సీమాంధ్రలో తమకు నష్టం జరిగినా ఫరవాలేదనే నిర్ణయానికి వచ్చి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర నాయకులు ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని గట్టిగానే కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా చెబుతున్నారు.

బిజెపి కూడా తన నిర్ణయాన్ని మార్చుకునే స్థితిలో లేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ నాయకులు కచ్చితంగా చెబుతున్నారు. బిజెపి యూటర్న్ తీసుకుంటే తప్ప విభజన ఆగదని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఇటీవల అన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజనను వ్యతిరేకించడం కాంగ్రెసు అధిష్టానానికి కాస్తా ఇబ్బందిగానే ఉంది.

పూర్తిగా యూటర్న్ తీసుకుని చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యం కోసం కేంద్రానికి లేఖ ఇవ్వాలని, జగన్ కూడా సమైక్యానికి లేఖ ఇవ్వాలని రాయలసీమకు చెందిన మంత్రి, కాంగ్రెసు నాయకుడు టిజి వెంకటేష్ అంటున్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్ లేఖ ఇస్తారేమో గానీ చంద్రబాబు మాత్రం ఇచ్చే అవకాశాలు లేవు. జగన్ కూడా సమన్యాయం షరతు పెట్టి మాత్రమే లేఖ ఇచ్చే అవకాశం లేదు. తెలంగాణకు వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం లేఖలు ఇస్తే తెలంగాణలో ఆ పార్టీలకు ఏ మాత్రం చోటు ఉండదు. ఆ విషయం తెలిసిన ఆ పార్టీల అధినేతలు అటువంటి సాహసానికి ఒడిగట్టకపోవచ్చునని అంటున్నారు.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయడం, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్రపతిని కలవడం వంటి పరిణామాలతో పాటు సమన్యాయం గురించి పెద్ద యెత్తున చంద్రబాబు, జగన్ మాట్లాడుతుండడం వంటి కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లు భావించవచ్చు. సమన్యాయమంటే ఏమిటో స్పష్టత ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అడిగే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద, జగన్, చంద్రబాబులను ఇరకాటంలో పెట్టడానికి అఖిల పక్ష సమావేశాన్ని కాంగ్రెసు అధిష్టానం వాడుకుంటుందనే మాట వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+