వాట్సప్ లో అద్దిరిపోయే ఫీచర్: ఇప్పుడే బుక్ చేసుకోవడం బెటర్- నో నంబర్ షేరింగ్
వాట్సాప్ లో ఓ నూతన అప్డేట్ అందుబాటులోకి రానుంది. ఇకపై ఫోన్ నంబర్ ఇతరులతో పంచుకోకుండానే వాట్సాప్‌లో సులభంగా చాట్ చేసే సదుపాయాన్ని తీసుకువస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన యూజర్‌నేమ్స్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ అప్ డేట్ త్వరలోనే అందించనున్నట్లు వాట్సాప్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా ప్రకటించారు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఒక యూజర్‌నేమ్ ఉపయోగించి సురక్షితంగా కనెక్ట్ కావచ్చు.
వాట్సాప్‌లో ఎవరితోనైనా ఛాట్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ నంబర్ వారికి ఇవ్వాల్సి వస్తోంది. ఇది కొంతవరకు వినియోగదారుల వ్యక్తిగత వివరాలకు ఇబ్బందిగా ఉండేది. దీనికి చెక్ పెట్టడంలో భాగంగా వాట్సాప్ ఈ కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం చివర్లో ఈ ఫీచర్ మరింత విస్తృతంగా అందుబాటులోకి రానుందని కునాల్ షా తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి అవసరమైన యూజర్‌నేమ్‌ల రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు.

సమయం చాలా విలువైనదని, యూజర్ నేమ్స్ అనే ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాకముందే తన పేరును రిజర్వ్ చేసుకున్నానని కునాల్ షా తెలిపారు. వాట్సప్ యూజర్లు కూడా వెంటనే వారి పేర్లను రిజర్వ్ చేసుకోవాలని ఎక్స్ ద్వారా కోరారు. ఈ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ సాధారణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్స్టాగ్రామ్ లేదా ఎక్స్ వంటి ఖాతాల తరహాలో పని చేయదు. అంటే.. వాట్సాప్‌లో ఇతరుల యూజర్‌నేమ్‌లను నేరుగా సెర్చ్ చేయడానికి ఎలాంటి ఓపెన్ డైరెక్టరీ లేదా సెర్చ్ ఆప్షన్ అందుబాటులో ఉండదు.
ఎవరైనా ప్రొఫైల్‌కు మొదటిసారి మెసేజ్ చేయాలంటే వారికి మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాలి. దీంతో పాటు అదనపు సెక్యూరిటీ కోసం వాట్సాప్ ఓ ప్రత్యేకమైన యూజర్‌నేమ్ కీ (Username Key) సదుపాయాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా మొదటిసారి కాంటాక్ట్ అయ్యే వ్యక్తి ఒక నిర్దుష్ట కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీ పేరును ఎలా రిజర్వ్ చేసుకోవాలి?
తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవడానికి యూజర్లు సెట్టింగ్స్‌లో ఉన్న ఆప్షన్లను మార్చుకోవాల్సి ఉంటుంది. మొదటగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా మొబైల్లోని వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేయాలి. ఆ తర్వాత యాప్ లోపల సెట్టింగ్స్ కేటగిరీకి వెళ్లి, అక్కడ ఉన్న అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే యూజర్‌నేమ్ ఆప్షన్ ద్వారా తమకు నచ్చిన పేరును నమోదు చేసి సరిచూసుకోవాలి. ఒకసారి పేరు ఖరారు అయ్యాక దాన్ని సులభంగా సేవ్ చేసుకోవచ్చు.
ఈ సరికొత్త యూజర్‌నేమ్స్ గరిష్టంగా 35 అక్షరాల నిడివి వరకు కలిగి ఉండవచ్చని వాట్సాప్ స్పష్టం చేసింది. వ్యాపార సంస్థలు, పబ్లిషర్లు తమ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకునేందుకు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ల పేర్లతోనే వీటిని సులభంగా అనుసంధానించుకోవచ్చు. వీఐపీలు, సెలబ్రిటీల పేర్లతో ఇతరులు నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి మోసాలకు పాల్పడకుండా ఉండేలా వాట్సాప్ ముందస్తు చర్యలు చేపట్టింది.
ఈ కొత్త అప్డేట్ల వల్ల పాత చాటింగ్‌లు లేదా సేవ్ చేసిన కాంటాక్ట్ వివరాలకు ఎలాంటి మార్పులు జరగవు. ఇదివరకే కాంటాక్ట్ లిస్టులో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులకు యథావిధిగా ఫోన్ నంబర్ ద్వారానే ఛాట్స్ పంపుకోవచ్చు. యూజర్ల సెక్యూరిటీ కోసం అందించే బ్లాకింగ్, రిపోర్టింగ్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి ఫీచర్లు ఎప్పట్లానే అందుబాటులో ఉంటాయి. ఈ రిజర్వేషన్ ప్రక్రియ రాబోయే కొద్ది నెలల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది.












Click it and Unblock the Notifications