ఆపత్కాలంలో బాలయ్య - సాయిరెడ్డి ఒక్కటిగా : ప్రత్యర్ధుల ప్రశంసలు..!!
తారకరత్న మరణం వేళ ఆ కుటుంబానికి అండగా నిలిచిన బాలయ్య -సాయిరెడ్డి పెద్దరికానికి అభినందనలు అందుతున్నాయి.
నందమూరి తారకరత్న మరణం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కళ్ల ముందే చలనం లేకుండా ఉండటం జీర్ణించుకోలేకపోతోంది. ముగ్గురు పిల్లలు, తండ్రికి ఏమైందో అర్దం కాని వయసు. అటు భర్త మరణం..ఇటు పిల్లల భవిష్యత్..ఏం చేయాలో తెలియని నిస్సహా స్థితి. ఈ సమయంలో అటు తారకరత్న బాబాయ్ బాలయ్య..ఇటు తారకరత్న సతీమణి అలేఖ్య బాబాయ్ విజయ సాయిరెడ్డి అండగా నిలిచారు.
తారకరత్న ఆస్పత్రిలో చేరిన సమయం నుంచి అంత్యక్రియల వరకు బాలయ్యే అన్నీ తానై వ్యవహరించారు. అటు అలేఖ్య కోసం సాయిరెడ్డి పెద్దగా నిలిచారు. నందమూరి - నారా కుటుంబ సభ్యులతో పెద్దరికంగా అలేఖ్య తరపు మాట్లాడారు. బాలయ్య నుంచి హామీ తీసుకున్నారు. తారకరత్న మరణం వేళ ఆ కుటుంబానికి అండగా నిలిచిన బాలయ్య -సాయిరెడ్డి పెద్దరికానికి అభినందనలు అందుతున్నాయి.

అన్నీ తానై వ్యవహరించిన బాలయ్య
తారకరత్న కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిన సమయం నుంచి అంత్యక్రియల వరకు బాలయ్య అన్నీ తానై వ్యవహరించారు. కుప్పం లో చికిత్స ప్రారంభించిన సమయం నుంచి బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను దక్కించుకోవటానికి బాలయ్య అనేక ప్రయత్నాలు చేసారు. విదేశాలకు తీసుకెళ్లాలని భావించారు. కానీ, ఆస్పత్రి వర్గాలు వారించాయి. విదేశీ వైద్యులనే రప్పించారు. తారకరత్న కోసం బాలయ్య ప్రత్యేకంగా పూజలు చేయించారు.
హోమాలు నిర్వహించారు. మృత్యుంజయ మంత్రం పదే పదే చదువుతూ దక్కించుకొనేందుకు బాలయ్య పడిన తపన అందరినీ కదిలించింది. ఇక..తాను ఎంత పోరాటం చేసినా..ఎంత చికిత్స అందించినా తారకరత్న దక్కలేదనే విషయం తెలియగానే బాలయ్య కన్నీరు మున్నీరు అయ్యారు. బాలయ్య అంటే తారకరత్నకు అదే స్థాయిలో అభిమానం.

అలేఖ్యకు అండగా బాబాయ్ సాయిరెడ్డి
మరో వైపు విజయ సాయిరెడ్డి. తన సతీమణి సోదరి కుమార్తె అలేఖ్య రెడ్డి. కష్టంలో ఉన్నఅలేఖ్యకు బాబాయ్ గా పెద్దరికంగా సాయిరెడ్డి అండగా నిలిచారు. తారకరత్న బెంగళూరు ఆస్పత్రిలో ఉన్న సమయంలో వెళ్లి పరామర్శించారు. అక్కడే బాలయ్య చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. అలేఖ్యకు ధైర్యం చెప్పారు. ఇక..తారకరత్న తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన భార్యాపిల్లలకు అండగా నిలిచారు. తారకరత్న కు నివాళి అర్పించేందుకు వచ్చిన వారిని పెద్దరికంగా పలకరించారు.చంద్రబాబుతోనూ రాజకీయం పక్కన పెట్టి తమ ఇంటి బిడ్డ కష్టంలో ఉన్న సమయంలో వచ్చిన వారిగా మాటలు కలిపారు. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, చిరంజీవి, షర్మిలతోనూ సాయిరెడ్డి మాట్లాడారు. పెద్ద మనిషిగా తన పాత్ర పోషించారు. ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా అందరితోనూ కలుపుకుపోయారు.

బాలయ్య - సాయిరెడ్డి పెద్దరికం
ఇక..తారకరత్న మరణంలో తల్లడిల్లుతున్న అలేఖ్య..పిల్లల భవిష్యత్ గురించి బాలయ్య - విజయ సాయిరెడ్డి చర్చించారు. అలేక్య- పిల్లల భవిష్యత్ గురించి సాయిరెడ్డి నేరుగా బాలయ్యతో చర్చించారు. తన ఆందోళన తెలియచేసారు. దీనికి బాలయ్య నుంచి సాయిరెడ్డికి భరోసా దక్కింది. తమ ఇంటి బిడ్డలకు ఎటువంటి కష్టం రాకుండా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అలేఖతో పాటుగా పిల్లల భవిష్యత్ తమదేనని స్పష్టం చేసారు. అలేఖ..పిల్లలు తమ ఇంటి పిల్లలనని భరోసా ఇచ్చారు.
దీంతో సాయిరెడ్డికి ఊరట లభించింది. ఇక..తారకరత్న అంత్యక్రియల విషయంలోనూ ఈ ఇద్దరూ చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తారకరత్న కోసం బాలకృష్ణ పలుసార్లు కంట తడి పెట్టుకున్నారు. బాలయ్యను సాయిరెడ్డి ఓదార్చారు. అలేఖ్య-తారకరత్న వివాహం..తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో నాడు బాలయ్య - సాయిరెడ్డి మద్దతిచ్చారు. ఇప్పుడు ఆపత్కాలంలోన ఈ ఇద్దరే అలేఖ్య-పిల్లలకు కొండంత అండగా నిలిచారు. వీరిద్దరూ తారకరత్న చికిత్స-మరణించిన వేళ పెద్దరికంగా వ్యవహరించిన తీరు పైన సాధారణ వ్యక్తులే కాదు..వారి ప్రత్యర్ధులు సైతం అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications