వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ఫ్యామిలీ - సిట్టింగ్ ఎంపీ సీటుపై హామీ..!?
ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. రాజకీయంగా వ్యూహ - ప్రతి వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యం గా టీడీపీ కార్యాచరణ అమలు చేస్తోంది. జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరుబాట ను ఎంచుకున్నారు. ఇదే సమయంలో పార్టీల్లో చేరికల అంశం కీలకంగా మారుతోంది. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్దమైంది. రాజకీయ భవిష్యత్.. సీటు కేటాయింపు పైన హామీ దక్కినట్లు సమాచారం.
టీడీపీ నుంచి వైసీపీలోకి
జగన్ సొంత జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. సీమలో సామాజిక సమీకరణాల్లోనూ ఈ చేరిక కీలకంగా మారుతోంది. కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి పేరుంది. రాయచోటి లో నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్మ లాంటి కుటుంబంగా గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు.. వైఎస్సార్ సమకాలీకుడు అయిన సుగవాసి పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

బలమైన వర్గం నేతగా
ఇక, పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రమణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రమణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజక వర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదనే మన స్థాపంతో ఈ మధ్య కాలంలో బాల సుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాసారు. ప్రజలు.. తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తరువాతనే బాల సుబ్రమణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది.
సీటు పై హామీ
బలిజ వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసిని పార్టీలోకి తీసుకోవటం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్దిగా బాల సుబ్రమణ్యం కు అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం జరిగింది. అయితే.. సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తాజాగా జనసేన నేతలు రంగంలోకి దిగారు. బిలజ వర్గానికి చెందిన కొందరు నేతలు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. కాగా, వచ్చే వారం జగన్ తో సుగవాసి భేటీ కానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైందని చెబుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తరువాత కూటమిలో ఏ పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. దీంతో, చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా.. సుగవాసి వైసీపీలో ఎంట్రీ ఇవ్వటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications