అధిష్టానం కొర్రీ సిపిఐ, కాంగ్రెసు పొత్తులో ప్రతిష్టంభన
న్యూఢిల్లీ/ హైదరాబాద్: సిపిఐకి సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెసు అధిష్టానం కొర్రీ వేసినట్లు తెలుస్తోంది. దీంతో సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. పొత్తుకు ఇరు పార్టీలు అంగీకరించినప్పటికీ సీట్ల విషయంలో అవగాహన కుదిరే అవకాశాలు కనిపించడం లేదు.
సిపిఐతో పొత్తు విషయమై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. సిపిఐకి ఏడు అసెంబ్లీ స్థానాలకు మించి ఇవ్వద్దని అధిష్టానం ఆదేశించినట్లు తెలియవచ్చింది. అయితే తమకు పది అసెంబ్లీ సీట్లు కావాల్సిందేనని సిపిఐ పట్టుపడుతోంది.

సీట్ల కేటాయింపు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అధిష్టానంతో ప్రస్తావించనున్నట్లు సమాచారం. అయితే, సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెసు నుంచి తమకు ఏ విధమైన సమాచారం లేదని, తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ బుధవారం హైదరాబాదులో అన్నారు.
పది శానససభా స్థానాలు ఇవ్వడానికి తెలంగాణ పిసిసి సూత్రప్రాయంగా హైదరాబాదులో మంగళవారం జరిగిన చర్చల్లో అంగీకరించింది. సిట్టింగ్ స్థానాలతో పాటు ఇతర స్థానాలను కేటాయించడానికి అంగీకరించింది. అయితే, అధిష్టానం అందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications