బీజేపీ - టీడీపీ -జనసేన పొత్తు పై క్లారిటీ : ముహూర్తం - వేదిక ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం పార్టీలు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ సిద్దమవుతున్నారు. ఇక, ఇప్పుడు తేలాల్సింది బీజేపీ విషయం. బీజేపీ రాష్ట్రంలో అంత బలంగా లేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ మద్దతు ఇక్కడ పోటీ పడుతున్న మూడు పార్టీలు కోరుకుంటున్నాయి. జనసేన - టీడీపీ పొత్తు సంకేతాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం జనసేన తో తమ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెబుతున్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం చివరి నిమిషం వరకు చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. ఏ అవకాశం వదులుకోవటానికి చంద్రబాబు సిద్దంగా లేరు.

తేలని ఏపీ పొత్తులు
అదే సమయంలో ఏపీ బీజేపీలోని ముఖ్య నేతల్లో పొత్తుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుతో కలిసిన పవన్ తోనూ పొత్తు అవసరం లేదని కొందరు చెబుతుంటే, పార్టీ బలోపేతం కావలంటే మూడు పార్టీలు కలిసి ఉండటం మంచిదనే అభిప్రాయం మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ, బీజేపీ ముఖ్య నాయకత్వం మాత్రం టీడీపీ గతంలో తమతో వ్యవహరించిన తీరు పైన ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని, పొత్తుకు ఛాన్స్ లేదని కమలం పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ నవంబర్ 11న విశాఖ రానున్నారు.

ప్రధాని పర్యటనపై రాజకీయ ఉత్కంఠ
అధికారిక కార్యక్రమాలతో పాటుగా పార్టీ నేతలతోనూ ప్రధాని సమావేశం కానున్నారు. బహిరంగ సభలోనూ పాల్గొంటున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలకు ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని విశాఖ పర్యటనకు ముందే తెలంగాణలో మునుగోడు ఫలితం వెల్లడి కానుంది. దీంతో, ఏపీలో పార్టీ భవిష్యత్ పైన ప్రధాని ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు ప్రధాని మోదీ టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేసారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన తరువాత రాజకీయంగా ఏపీలో ప్రధాని మోదీ రాజకీయ సభల్లో పాల్గొనలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమరావతికి మద్దతుగా రైతుల యాత్రలో పాల్గొనాలని సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్దేశించారు.

టీడీపీతో జత కడతారా - ఏం తేల్చనున్నారు
ఇప్పుడు ప్రధాని పర్యటన సమయంలో అమరావతి రైతులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, పార్టీ నేతలకు ప్రధాని మూడు రాజధానులు - పొత్తుల అంశం పైన స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత టీడీపీ -బీజేపీ- జనసేన పొత్తు వ్యవహారం తేలే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు ప్రధాని పర్యటన ఏపీ భవిష్యత్ రాజకీయాల పైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉండటంతో మోదీ విశాఖ టూర్ మరింత ఆసక్తి పెంచుతోంది.












Click it and Unblock the Notifications