Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని (Amaravati) గుర్తిస్తూ తయారు చేసిన తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమని ఇందులో పేర్కొన్నారు. అలాగే రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయటం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని తీర్మానం ప్రవేశపెట్టే ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీనిపై తన అభిప్రాయం వెల్లడించారు. చారిత్రాత్మక తీర్మానం చేసే సందర్భంలో భాగస్వాములవుతున్నామని తెలిపారు. సభకు హాజరు కాని వైసీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపమని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞంగా అభివర్ణించారు.

2014లో రాష్ట్రాన్ని తీరం చేర్చే బాధ్యత చంద్రబాబుకు అప్పగించారని, తన అపార అనుభవంతో ప్రగతి బాటలో నడిపేలా ప్రణాళిక రూపొందించారని స్పీకర్ తెలిపారు. అందర్నీ సంప్రదించి భౌగోళికంగా కేంద్ర బిందువు అయిన అమరావతిని రాజధానిగా చేశారన్నారు. చంద్రబాబు నిర్ణయంపై గౌరవంతో అమరావతి రైతులు సహకరించారని, భూములిచ్చారన్నారు. అమరావతి నిర్మాణ పనులు 2104-19 మధ్య కాలంలో మొదలయ్యాయని, కానీ 2019లో దురదృష్టవశాత్తూ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయన్నారు.

2019-24 మధ్య కాలంలో ప్రగతి నిరోధక పోకడకల వల్ల రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వీధినపడ్డారు... అవమానాలకు పాలయ్యారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా... శాశ్వత రాజధానిగా అమరావతికి శిలాక్షరాల్లో లిఖించాల్సిన అవసరం ఉందని ప్రజా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ధృఢ సంకల్పంతో చేసిన కృషి వల్ల రాజధాని విషయమై రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. దీని కోసం తీర్మానం చేసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించుకుంటున్నట్లు వెల్లడించారు.కనీసం ఈ రోజైనా ఆ 11 మంది (వైసీపీ) వస్తారని భావించానని, తీర్మానాన్ని బలపరిచి చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందుతారని ఆశించానన్నారు. కానీ చేసిన తప్పులను ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ వాళ్లకు లేదని అర్థమైందని, ఇది వారి విజ్ఞతకే వదిలేద్దామన్నారు.












Click it and Unblock the Notifications