మళ్లీ సుప్రీం గడప తొక్కిన అమరావతి రైతులు-14న విచారణకు నిర్ణయం..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిలో భూములపై తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే జీవో నంబర్ 45 కూడా జారీ చేసింది. దీనిపై స్ధానిక రైతులు హైకోర్టును ఆశ్రయించినా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇప్పుడు అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
అమరావతి రాజధానిలో భూముల్ని అన్ని ప్రాంతాలవారికి కేటాయించేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 45 తీసుకొచ్చింది. దీనిపై స్ధానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో అమరావతిలో నిర్మాణ పనులు చేయకుండా పక్కనబెట్టేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు తాము రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని ఇతర ప్రాంతాల వారికి పంచేందుకు సిద్ధమవుతుండటంపై రైతుల్లో ఆక్రోశం కనిపిస్తోంది.

అమరావతిలో భూముల్ని ఇతర ప్రాంతాలవారికి కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ రైతులు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు సీజే ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీంతో ఈ నెల 14న ఈ పిటిషన్ ను విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ నెల 10నే విచారణ జరపాలని రైతులు కోరినా అప్పటికే లిస్ట్ అయిన కేసులు ఉన్నందున 14న విచారణ చేస్తామని వెల్లడించారు.
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసిన ఆర్ 5 జోన్ లోని 1134.58 ఎకరాలలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 24 వేల మంది నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు 583.93 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 550.65 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించించింది. అంతేకాదు వీటిలో పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా ఆహ్వానిస్తోంది. త్వరలో ఈ పనులు కూడా మొదలుకానున్నాయ.. ఈ నేపథ్యంలో రైతులు వెంటనే జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరినా స్పందించకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపుతట్టారు.












Click it and Unblock the Notifications