అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్..!!
అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్ పడింది. అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభం సమయం నుంచి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. కొన్ని ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతన్న సమయంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ యాత్రకు పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు - నల్ల బెలూన్లతో నిరసనలు కనిపించాయి. ఇక, ఇప్పుడు యాత్ర కొనసాగింపుకు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది.
అక్కడ రైతులు బస చేస్తున్న ఫంక్షన్ హాల్ దగ్గరకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతులకు మద్దతు ఇచ్చే వారిని అనుమతించ లేదు. హైకోర్టు సూచనల ప్రకారం ఆరు వందల మంది యాత్రలో పాల్గొనే వారికే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అనుమతి ఉన్నవారిని కాకుండా మిగిలిన వారి వాహనాలను అనుమతించమని పోలీసులు స్పష్టం చేసారు.
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అమరావతి రైతులు ఉన్న విజయ ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసులు ఎలా మోహరించారో చూడండి. రైతుల పాదయాత్ర విషయంలో జగన్ రెడ్డి భయానికి, కుట్రకి ఇది నిదర్శనం. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపైన, మీడియా పైన కూడా ఆంక్షలు పెట్టారు.#AmaravatiFarmersMarch2022 pic.twitter.com/mOAQb8iCOq
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2022
దీంతో, అక్కడ రైతులు.పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం అయింది. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరు పైన కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.
కోర్టుకు వరుసగా నాలుగు రోజులు సెలవు కావటంతో అప్పటి వరకు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసారు. తిరిగి న్యాయస్థానం మార్గదర్శకాల మేరకు అరసవల్లి వరకు పాదయాత్ర కొనసాగిస్తామని అమరావతి రైతులు వెల్లడించారు. అటు ఉత్తరాంధ్రలో యాత్ర ప్రవేశించిన తరువాత అనుసరించాల్సిన వైఖరి పైన ఆ ప్రాంత నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే అక్కడ విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. విశాఖ రాజధానిగా చేయాలనే ఉద్యమానికి మద్దతుగా రాజీనామాకు మంత్రి ధర్మాన సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు రైతులు పాదయాత్ర తాత్కాలికంగా నిలుపుదల చేయటం.. కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించటంతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications