సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గిన అమరావతి రైతులు..!
ఏపీలో అమరావతి రాజధానిలో గతంలో సేకరించిన భూముల్ని ఇతర ప్రాంతాలు, జిల్లాల వారికి కూడా ఇళ్ల స్ధలాల కోసం కేటాయించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ 5 జోన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన రైతులు ఇవాళ వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఏపీ రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్లకు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు కూడా వేసింది. మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు ...దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని సుప్రీం కోర్టు రైతుల్ని అడిగిందని ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుండటంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఆర్-5 జోన్‌పై పిటిషన్‌ను అమరావతి రైతులు వెనక్కి తీసుకున్నారు. ఆర్-5 జోన్ అంశంపై ఈనెల 19న హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సుప్రీంలో వేసిన పిటిషన్‌ను రైతులు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సుప్రీంకోర్టు కూడా అనుమతించింది. ఆర్ 5 జోన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై 19న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది.

సుప్రీంకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేసే సమయానికి హైకోర్టు ఉత్తర్వులు రాలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్యాందివాన్.. సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తెచ్చారు. దీంతో జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం శ్యాందివాన్ వాదనతో ఏకీభవిస్తూ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. అలాగే రాష్ట్ర హైకోర్టు తీర్పు తరువాత మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చేందుకు అనుమతించింది.












Click it and Unblock the Notifications