23 నాడే చంద్రబాబు విచారణ: అమరావతిలో 500 ఎకరాల అసైన్డ్ భూములే కీలకం: ఇన్‌సైడర్ ట్రేడింగ్
అమరావతి: అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. దీనికి సంబంధించిన నోటీసులను అందజేసినట్లు సమాచారం. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ (సీఆర్‌పీసీ) కింద నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు నోటీసులను జారీ చేసిన విషయాన్ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ధృవీకరించారు. ఈ నెల 23వ తేదీ నాడు సీఐడీ విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబుకు సూచించినట్లు చెప్పారు.

ఆ 500 ఎకరాలే కీలకం
అమరావతి భూ కుంభకోణంలో 500 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారమే ప్రస్తుతం కీలకంగా మారినట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తరువాత.. ఏకంగా 500 ఎకరాల అసైన్డ్ భూములను వేర్వేరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించారు. దీన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌గా నిర్దారించారు. ప్రస్తుతం ఈ 500 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారమే చంద్రబాబుకు ఇబ్బందులను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవి రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతులు ఇచ్చిన భూములేననే వాదన వినిపిస్తోంది.

ఉచిత ప్లాట్ల కేటాయింపులోనూ
ఈ 500 ఎకరాలను కొనుగోలు చేసిన వేర్వేరు వ్యక్తులెవరనేది తేలాల్సి ఉంది. వారంతా చంద్రబాబు బినామీలేననేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్లాట్ల కేటాయింపులోనూ వారి పేర్లను చేర్చారనే విమర్శలు ఉన్నాయి. అన్ని రకాలుగా ఆ కొనుగోలుదారులకు లబ్ది కలిగించేలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, దానికి అనుగుణంగా జీవోలను జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద చంద్రబాబు తన బినామీలకు రాజధాని అమరావతి ప్రాంత భూములను అప్పనంగా కట్టబెట్టారంటూ వైసీపీ నేతల విమర్శలకు అదే కారణమని చెబుతున్నారు.

4000 ఎకరాలకు పైమాటే..
నిజానికి- నాలుగు వేల ఎకరాలకు పైగానే అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలపై ఉన్నాయి. రాజధాని ప్రకటనకు ముందే అప్పటి టీడీపీ నాయకులు ఆ భూమిని కొనుగోలు చేశారంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో 900 వందల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఇప్పుడు 500 ఎకరాల మేర అసైన్డ్ భూములను వేర్వేరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఏపీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులను జారీ చేశారు.

ప్రజాబలం లేదని తేలిన తరువాతే..
రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసు మరోసారి తెర మీదికి రావడం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని భూముల సమీకరణ సమయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఆ కారణంతోనే నోటీసులను జారీ చేస్తున్నామని వారు చంద్రబాబుకు వివరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications