ఏపీ రాజధానిగా మళ్లీ అమరావతే- త్వరలోనే: చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి- మూడు రాజధానులు. న్యాయపరమైన ఇబ్బందుల వల్ల దీన్ని అమలు చేయడంలో జాప్యం ఏర్పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లు- సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్ జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగించే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తొమ్మిది నెలల్లో మళ్లీ అమరావతే రాజధానిగా మారబోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోన్నది తామేనని తేల్చి చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే- ఏపీ రాజధానిగా అమరావతిని పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ఇవ్వాళ గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతి రాజధానిగా మారబోతోందనే విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సరికొత్త అమరావతిని నిర్మించామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు.
అమరావతి చరిత్రను తాము తిరగరాశామని, అమరావతి పేరెత్తగానే స్వర్గం గుర్తుకొస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి వైఎస్ జగన్‌కు ఎలా బుద్ధొచ్చిందో తనకు అర్థం కావట్లేదని అన్నారు. అమరావతి ఎక్కడికీ పోదని, తొమ్మిది నెలల తరువాత మళ్లీ పరుగెత్తిస్తామని చెప్పారు.
9 నెలల తర్వాత అమరావతి మన వద్దకే వస్తుంది: చంద్రబాబు#Chandrababu #Amaravati #Oneindiatelugu pic.twitter.com/tfNrcoPRky
— oneindiatelugu (@oneindiatelugu) June 9, 2023
వైఎస్ జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడిందని, త్వరలోనే వెళ్లిపోతాడంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కవ అన్నట్లు వైఎస్ జగన్ వ్యవహరిస్తోన్నాడంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి చరిత్రను మళ్లీ తిరగరాస్తానని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తన పరిపాలనలో అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరమౌతుందని అన్నారు.












Click it and Unblock the Notifications